Mar 02,2021 23:36

ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు, అభ్యర్థి జ్యోతి రాయల్‌

ప్రజాశక్తి - నంద్యాల: నంద్యాల పట్టణంలోని 24వ వార్డు సిపిఎం అభ్యర్థి ఆలమూరు జ్యోతి రాయల్‌ను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు వార్డు ప్రజలను కోరారు. మంగళవారం 24వ వార్డు సాయిబాబా నగర్‌లోని పక్కిర్‌ పేట, భగత్‌ సింగ్‌ గ్రంధాలయం లైన్‌, నూనెపల్లె మటన్‌ మార్కెట్‌, వార్డు చివరి వరకు సిపిఎం అభ్యర్థి ఆలమూరు జ్యోతి రాయల్‌ ఆ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి తనకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఏ నాగరాజు, నంద్యాల పట్టణ కార్యదర్శి తోట మద్దులు, పట్టణ నాయకులు లక్ష్మణ్‌ మాట్లాడుతూ సిపిఎం గతంలో గెలిచినప్పుడు సాయిబాబా నగర్‌లో సిసి రోడ్లు, డ్రైనేజ్‌ కాల్వలు నిర్మించడంతో పాటు శ్రమదానం బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారలు వేయడమే పనిగా పెట్టుకుందన్నారు. ఇంటి, కొళాయి పన్నులు పెంచి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. మున్సిపాలిటీలో సిపిఎం తరుపున కౌన్సిలర్లు లేకుంటే ప్రజల పక్షాన మాట్లాడే నాథుడే ఉండడని, కాబట్టి సిపిఎం తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేసి కౌన్సిలర్‌లు గా గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో అభ్యర్థి భర్త ఏ.సాయిరాం రాయల్‌, నాయకులు రమేష్‌, లక్ష్మణ్‌, జైలాన్‌, బంగారయ్య, నరేష్‌, స్థానిక మహిళలు పాల్గొన్నారు.