Aug 22,2021 13:23

    తీగలు, తీగలుగా అల్లుకుపోయి ఆయాసీజన్లలో అపురూపమైన పువ్వులు, పండ్లు ఇచ్చే మనోహరమైన మొక్కలు తీగ మొక్కలు. వందల రకాలున్న వీటిని క్రీపర్స్‌ అని పిలుస్తారు. వీటిని ఇంటి ముంగిట పందిరిలా, ప్రహరీ గోడలు, డాబా అంచులమీద, ఇంటి పైకప్పు మీద వివిధ రకాల ఆకృతుల్లో పెంచుకోవచ్చు. తీగ మొక్కలను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం ... రూఫ్‌ గార్డెన్‌ పెంచుకొనే కూరగాయ మొక్కల్లో ఎక్కువ రకాలు క్రీపర్లే. వీటిల్లో కొన్ని పాదు(తీగ)మొక్కలు కుండీల్లో పెంచుకొనే సదుపాయమూ ఉంటుంది. ఒకప్పటిలా కాకుండా ఇండోర్‌లో పెంచుకునే పూల పాదుమొక్కలూ వస్తున్నాయి. కాకపోతే వీటికి చీడ, పీడ తెగుళ్లు ఆశించే స్వభావం ఎక్కువ. ఎప్పటికప్పుడు జరభద్రంగా వాటిని కాపాడుకోగలిగితే మనసులు నిండా అల్లుకుపోయే ఈ పాదుమొక్కలు ఎల్లప్పుడూ ఎవర్‌గ్రీనే.
 

                                                                         అల్లమండా

అల్లమండా

ఒకటి, రెండు నెలల మినహా ఏడాదంతా పువ్వులు పూసే చక్కటి పాదుమొక్క అల్లమండా. దీని పువ్వులు దళసరిగా బూర గొట్టాలా ఉంటాయి. మొక్క నిండుగా పువ్వులు పూస్తుంది. దీనిని గోడల మీద వాలుగా పాకించవచ్చు, చలువ పందిరిలా అల్లుకోవచ్చు. అంతేనా కుండీల్లో వేసుకుని ఒక రాట చుట్టూ అల్లించుకోవచ్చు. ఇష్టమైన రూపులో కత్తిరించుకోవచ్చు. పసుపు రంగు పువ్వులు ఎక్కువగా లభిస్తాయి. ఇంకా వీటిలో తెలుపు, జేగురంగు పువ్వులు దొరుకుతాయి. ఆ పువ్వులు కాస్త పెద్ద పరిమాణంలో ఉంటాయి.
 

                                                              మండవిలియా పువ్వులు

 మండవిలియా పువ్వులు

పెద్దపెద్ద పువ్వులు నక్షత్ర తళుకులతో కాంతులీనేవి మండవిలియా పువ్వులు. దీని పువ్వు చాలా నిఘారింపుగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలుపు, ఎరుపు, పింక్‌, నీలంవంటి రంగులు వీటిలో ఉన్నాయి. ఒకే కుండీల్లో రంగురంగుల మండవిలియా పూలమొక్కలు పెంచడం ఒక పోకడిగా మారింది. ఇలాంటి మొక్కలు ధరలో కాస్త ప్రియమే. ఈ మొక్క ఇంటిలో ఎక్కడ ఉంచినా ఇంటికి మరింత శోభను అద్దుతాయి.

                                                                     రాధా మనోహారం

రాధా మనోహారం

తెలుపు, ఎరుపురంగు పువ్వుల కలబోతతో గుత్తులు గుత్తులుగా పువ్వులు పూసే అరుదైన తీగజాతి మొక్క రాధా మనోహరం. నిజానికి తొలుత పువ్వులు తెల్లగా ఉంటాయి. ముదిరిన తరువాత ఎరుపురంగులోకి మారిపోతాయి. పాదు చక్కగా పెరిగి వేసవి వెళ్లిన తరువాత నిండుగా గుభాళిస్తుంది. సాయంత్రం వేళల్లో వీటి సుగంధాలు చాలాదూరం వరకూ గుప్పిస్తాయి. ఏళ్ల తరబడి పెరిగిన తరువాత కాయలు కాస్తుంది. ఈ పాదు అవశేషాలను ఆయుర్వేద వైద్యంలో చర్మ సంబంధ రోగాలకు ఉపయోగిస్తారు. దీనిని రంగూన్‌ మల్లి, రంగూన్‌ క్రీపర్‌ అని కూడా పిలుస్తారు.
 

                                                                  ఫైరోస్టేజియా వెనుష్టా

 ఫైరోస్టేజియా వెనుష్టా

ఎంతో మనోహరమైన పాదుపూల మొక్క ఫైరోస్టేజియా వెనుష్టా. వీటి పూలరంగు, ఆకారం చాలా సుందరంగా ఉంటాయి. పువ్వులు లిల్లీ ఆకారం, కాషాయ రంగులో ఉంటాయి. సీజన్‌ రాగానే అసలు ఆకులే కనిపించకుండా గుత్తులు గుత్తులుగా పాదంతా పువ్వులు విరబూస్తుంది. ప్రహరీ గోడలే కాకుండా స్తంభాలు, కొబ్బరి చెట్లు, తాటిచెట్ల మీదకు తీగలు మళ్లిస్తే చక్కగా అలుముకుని పువ్వులు పూస్తాయి. ఇవి శీతాకాలం ఆరంభం నుంచి వసంత కాలం వరకూ పూలు పూస్తూ ఉంటాయి. వీటిని కుండీల్లోనూ, నేలమీదా పెంచుకోవచ్చు. ఆరెంజ్‌ ట్రంపెట్‌ వైన్‌, ఫ్లేమ్‌ వైన్‌ అనికూడా వీటిని పిలుస్తారు.
 

                                                              మార్నింగ్‌ గ్లోరీ

మార్నింగ్‌ గ్లోరీ

దీనిని ఐపోమీయా పర్పురియా శాస్త్రీయనామంతో పిలుస్తారు. అధునాతన ఫ్యాన్సీ రంగుల కలబోతలతో పువ్వు ఎంతో నాజూగ్గా ఉంటుంది. సిల్కీగా మెరుపులతో ఉండే ఈ కుసుమాలు చూడగానే జిగేల్‌ మనిపిస్తాయి. బాకాలు ఆకారంలో ఉండే పువ్వులు పైన ఒక రంగు లోలోపల మరోరంగుతో చూడచక్కగా ఉంటాయి. ఉదయం విడిచిన పూలు సాయంకాలానికి వాడిపోతాయి. మార్నింగ్‌ గ్లోరీలో వందల రకాల పాదు మొక్కలున్నాయి. ఈ పాదు భాగాలను కూడా వైద్యరంగంలో వాడుతున్నారు.
 

                                                                           ద్రాక్ష

ద్రాక్ష

ఒకప్పుడు పులుపు ద్రాక్ష మార్కెట్లో దొరుకుతుండేది. నేడు తియ్యని ద్రాక్షనూ అందుబాటులోకి వచ్చింది. మన ప్రాంతాల్లోనూ చక్కగా ద్రాక్ష పాదులు పెరిగి కాపు కాస్తున్నాయి. ఇండ్లలో కాస్త జాగా ఉంటే చాలు ద్రాక్షపాదు నాటుతున్నారు. గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పండ్లు కాస్తాయి. నేలలో ఇసుక పొర ఉంటే పాదు బాగా ఎదుగుతుంది. కుండీల్లోనూ, నేలమీదా వీటిని పెంచుకోవచ్చు.
 

                                                                  మనీ ప్లాంట్‌

   మనీ ప్లాంట్‌

పత్రాలు నవనవలాడుతూ తేజోవంతంగా ఆకర్షించే పాదుమొక్క మనీప్లాంట్‌. పోతుస్‌ దీని శాస్త్రీయనామం. ఆకులు రెండు లేదా మూడు రంగుల మల్టీకలర్‌ డిజైన్లతో ఇవి ఆకట్టుకుంటాయి. వీటిలో కూడా పదుల సంఖ్యలో రకాలున్నాయి. ఎక్కువగా కుండీల్లో పెంచుకునే సౌలభ్యమున్న ఈ మొక్కలు కొబ్బరిపొట్టు మిశ్రమంలో బాగా పెరుగుతాయి. ఆకులు పెళుసుగా ఉండే ఇవి కాస్త నీడగా ఉన్న ప్రదేశాల్లో పెంచుకుంటే ఆ ప్రాంతానికే మరింత శోభనిస్తాయి.
 

                                                                         కర్టెన్‌ క్రీపర్‌

  కర్టెన్‌ క్రీపర్‌

ఇంటికి ఆకుపచ్చని అందాన్ని అద్దే మొక్క కర్టెన్‌ క్రీపర్‌. పాదు గుబురుగా పొదలా పెరుగుతుంది. తీగలకు రెండువైపులా అభిముఖంగా ఉండే పత్రాల వరుస ప్రత్యేకమైన అందాన్ని అద్దుతుంది. ఎలియాగ్నిఫోలియా శాస్త్రీయనామంతో పిలిచే ఇది బర్మా దేశానికి చెందిన పాదుమొక్క. ప్రహారీ, డాబా అంచుల మీద పెంచితే అందంగా కర్టెన్‌లా పెరిగి ఇంటి లోపలకు ధూళి రాకుండా అడ్డుకుంటుంది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ పాదును కనీసం మూడు నెలలకోసారైనా కత్తిరించుకోవాలి. ఫిబ్రవరి మార్చి నెలల్లో నూగులాంటి తెల్లటి పువ్వులు పూస్తుంది.
 

                                                                   సముద్రపాల

 సముద్రపాల

ఎన్నో దివ్య ఔషధ గుణాలు కలిగిన సుందర పాదుమొక్క సముద్రపాల. సిల్వర్‌ రంగులో దీని తీగలు లావుగా అందంగా ఉంటాయి. ఆకులు దళసరిగా అరచేతికంటే పెద్దగా ఉంటాయి. వీటి పుష్పాలు తూటి పువ్వుల్లా ఉంటాయి. పువ్వులు పైన లేతనీలం, లోపల ముదురు నీలంతో అందంగా ఉంటాయి. దీని శాస్త్రీయనామం అరజిరేయా నిర్వాస. దీన్ని ఏనుగు క్రీపర్‌ అని పిలుస్తారు. ఇది మనదేశపు పాదే.
 

                                                                  నాచు క్రీపర్‌

 నాచు క్రీపర్‌

నాచు క్రీపర్‌ పేరుతో పిలిచే ఈ పాదు శాస్త్రీయనామం ఐపోమియా కామోక్లిట్‌. సన్నని ఆకులు, సన్నని తీగలు ముదురు పింకు రంగు పువ్వులతో కనువిందు చేసే అపురూపమైన తీగ మొక్క నాచుక్రీపర్‌.
 

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506