Dec 02,2021 19:55

జార్ఖండ్‌కు చెందిన ఇంజనీర్‌ విశాల్‌ ప్రసాద్‌ గుప్తా చెరువుల్లోని మైక్రో ఆల్గే జాతుల నుంచి బయో ఇంధనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఇంధనాన్ని పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత రెండు వాహనాల్లోనూ ఉపయోగించొచ్చు. ఇది పర్యావరణ అనుకూలమైనది. పెట్రోల్‌, డీజిల్‌ కంటే చౌకైనది. ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితమైన జీవ ఇంధనాన్ని సృష్టిస్తున్నారు విశాల్‌.
విశాల్‌ తాత 1932లో బర్మాషెల్‌ (ఇప్పుడు భారత్‌ పెట్రోలియం)లో పనిచేశారు. తండ్రి 1969లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసి)లో డీలర్‌గా చేశారు. ఈ కుటుంబం నుంచి వచ్చిన విశాల్‌ సామాన్యుల కోసం తక్కువ ఖర్చుతో ఆల్గేనుంచి కార్బన్‌ తటస్థ ఇంధనాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు. ఆల్గే పెంపకం కోసం సిటీ డ్యాములను ఉపయోగించి భారీ స్థాయిలో జీవ ఇంధనాన్ని తయారు చేయడానికి రాంచీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో విశాల్‌ చర్చలు జరిపారు.
బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మెస్రా నుండి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత, విశాల్‌ ఐఒసితో క్రియాశీల అవగాహన ఒప్పందాన్ని కలిగివున్న బహుళజాతి చమురు, గ్యాస్‌ కంపెనీ టోటల్‌ ఎనర్జీస్‌ (ఎస్‌ఇ - అప్పటి టోటల్‌ ఫ్రాన్స్‌)లో మార్కెటింగ్‌ స్పెషలిస్టుగా పనిచేశారు. పదిహేనేళ్ల పాటు అనేక ఇతర పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ (పిఎస్‌యు) యూనిట్లతో కలిసి పనిచేశారు. బిర్సా ప్రొఫెసర్‌ డాక్టర్‌ కుమార్‌ భూపతి, విశాల్‌ కలిసి ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే మైక్రో ఆల్గేను పశువులకు దాణాగా పరిశోధించారు. అప్పుడే ఆల్గేలో క్రూడాయిల్‌ రసాయన భాగాలున్నాయని, దానిని జీవ ఇంధనాన్ని అభివద్ధి చేయడానికి ఉపయోగించవచ్చని విశాల్‌ గ్రహించారు.

ఆల్గేతో జీవ ఇంధనం
పరిశోధనకు భారత ప్రభుత్వ పెట్రోలియం కన్జర్వేషన్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ద్వారా ఆమోదం పొందారు. తన ఊరితో చెలిమి, పరిశ్రమలో బలమైన నెట్‌వర్క్‌ కారణంగా తన ఉత్పత్తిని సులభంగా మార్కెట్‌ చేయగలిగారు. రోజుకు 2,000-2,500 లీటర్ల చొప్పున ఇప్పటివరకు 2 లక్షల 50 వేల లీటర్ల జీవ ఇంధనాన్ని విక్రయించారు. గణనీయమైన పరిమాణంలో చమురును కలిగివున్న అజోల్లా పిన్నాట అనే ఆల్గే జాతిని చెరువు నుండి బయటకు తీసి హెక్సీన్‌ అనే రసాయన సమ్మేళనంలో వేస్తారు. చర్య ద్వారా అది ద్రవరూప కొవ్వుగా మారుతుంది. తర్వాత ఇది బయోడీజిల్‌ లేదా బయోఇథనాల్‌ తుది రూపాన్ని పొందుతుంది. 13 చెరువుల్లోని ఆల్గేలపై 13 గంటలపాటు అంతర్భాగంగా సూర్యరశ్మి ప్రక్రియ ఉంటుంది. రాత్రిపూట మైక్రో ఆల్గే పెంపకానికి సహాయపడే అతినీలలోహిత దీపాలు ఉన్నాయి. 2020, డిసెంబర్‌లో నామ్‌కుమ్‌ పక్కన ఏర్పాటు చేసిన ఈ కర్మాగారంలో ప్రస్తుతం 35 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానిక ఎన్‌జిఒ సభ్యులు ఆల్గేను పండించడంలో, చెరువుల సంరక్షణలో సహాయం చేస్తున్నారు.