
ప్రజాశక్తి బిజినెస్ బ్యూరో : నవంబర్ 26న జరిగే అఖిల భారత సమ్మెలో బ్యాంక్ ఉద్యోగులు భాగస్వాములు అవుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను నిర్వీర్యం చేసి దేశ, విదేశీ సంస్థలకు బ్యాంకింగ్ రంగాన్ని కట్టబెట్టే ప్రభుత్వ విధానాలకు, ఉద్యోగ, కార్మికులకు అండగా ఉన్న కార్మిక చట్టాలను మార్చడాన్ని, శ్రమ దోపిడి తదితర అంశాలకు నిరసనగా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) వైస్ ప్రెసిడెంట్ పి వెంకట రామయ్య తెలిపారు. బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ప్రభుత్వ విధానాల పట్ల తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సమ్మెలో వాణిజ్య బ్యాంక్‌లు, గ్రామీణ బ్రాంక్లు, సహకార బ్యాంక్‌లు, రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారని తెలిపారు.
బ్యాంకింగ్ రంగాన్ని మొండి బాకీలతో ధ్వంసం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు సొంత బ్యాంక్‌లు పెట్టుకోవడానికి లైసెన్స్‌లు ఇవ్వడానికి వీలుగా ప్రభుత్వం చట్టాలను మార్చుతుందన్నారు. దేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలవుతున్న మూడు దశాబ్దాల కాలంలో సుమారు 40 ప్రయివేటు బ్యాంక్‌లు దివాలా తీశాయని ఆయన గుర్తు చేశారు. ఈ చరిత్ర మర్చిపోయి కార్పొరేట్ బ్యాంక్‌లను ప్రోత్సహించడం లాంటి చర్యలు డిపాజిటర్ల సొమ్ముకు, దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమన్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ దివాలా తీస్తే.. దాన్నీ ప్రభుత్వ రంగ బ్యాంక్ లేదా దేశీయ బ్యాంక్‌లో విలీనం చేయకుండా సింగపూర్‌కు చెందిన డిబిఎస్ బ్యాంక్‌లో కలపాలన్న ఆర్బిఐ నిర్ణయం ద్వారా భారత బ్యాంకింగ్ రంగాన్ని విదేశీ శక్తులకు అప్పగించే ప్రక్రియ మొదలయ్యిందనడానికి నిదర్శనమన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో వందలాది కార్పొరేట్ బ్యాంక్‌లు కుప్పకూలాయన్నారు. కానీ భారత బ్యాంక్‌లు అనేక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సామర్థ్యమేనని అన్నారు.
అలాంటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను కాపాడాలని, కార్పొరేట్ల మొండి బాకీలను వసూలుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఆర్బిఐ నియంత్రణ, పర్యవేక్షణ పెంచి బ్యాంకింగ్ రంగాన్ని కాపాడాలని, డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించాలని కోరుతూ బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్దం అవుతున్నారన్నారు. తమ ఈ సమ్మెకు సామాన్య ప్రజానికం, బ్యాంక్ ఖాతాదారులు కూడా మద్దతు తెలియజేసి ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను కాపాడుకోవటంలో కలిసి రావాలని వెంకట రామయ్య కోరారు.