Jul 30,2021 21:08

ప్రజాశక్తి - భవానీపురం : పేద ప్రజలకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం అక్షయ పాత్ర ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో 44వ డివిజన్‌లోని కార్పొరేటర్‌ మైలవరపు రత్నకుమారి కార్యాలయం వద్ద వందలాది మంది పేదలకు నిత్యావసర సరుకులను ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సాయంతో పాటు ప్రజలకు సేవలు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అక్షయపాత్ర ఫౌండేషన్‌ వారు ఐదు లక్షల మంది పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, అత్తులూరి ఆదిలక్ష్మీ, అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.