Sep 15,2021 22:32

నుడా కార్యాలయం

నుడా కార్యాలయం
అక్రమ లేఅవుట్లకు ఇక చెక్‌..!
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ నియామకం
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :నెల్లూరు ఆర్చన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (నుడా) పరిధిలో ఇప్పటి వరకు అడ్డూ అదుపు లేకుండా సాగిపోతున్న అక్రమ లేవుట్స్‌కు చెక్‌పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. నుడా ఛైర్మన్‌ ముక్కాల ద్వారకానాధ్‌ ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక ఎన్‌పోర్స్‌మెంట్‌ టీమ్‌లను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నుడా ఏర్పాటు నుంచి ఆ సంస్థ ఆదాయానికి గండికొడుతూ, ఎలాంటి అనుమతులూ లేకుండా నెల్లూరు కార్పొరేషన్‌, గూడూరు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట,తోపాటు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ లేవుట్స్‌ వెలశాయి. నుడా అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను
లు చెల్లించకుండా కొందరు వ్యక్తులు, రాజకీయ, అధికారిక పలుకుబడి ఉపయోగించి అందినవరకు దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు వారిని అడిగే నాధుడే లేకుండా పోయింది. ప్రజలు అమాయకంగా అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్న స్థానాలు కాకుండా ఏదొకటి కొనుగోలు చేశారు. ఇటీవల నుడా విసి రమేష్‌కుమార్‌ నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల పరిధిలో దాడులు నిర్వహించి లేవుట్స్‌ను ధ్వంసం చేశారు. అక్రమదారులకు హెచ్చరికలు జారీ చేశారు. నుడా పరిధిలో ఇలాంటి అక్రమాలు అధికంగా ఉండి, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు రాకుండా నష్టం జరుగుతుందని గ్రహించిన నుడా ఛైర్మన్‌ ముక్కాల ద్వారకానాధ్‌ ఆదేశాలతో రెండు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లను రంగంలోకి దింపుతున్నారు. వీరి జిల్లా వ్యాపితంగా పర్యటించి, లేవుట్‌ను తనిఖీ చేసి, సరిగా లేకుండా అనుమతులు రద్దు చేయడానికి అధికారం కల్పించారు.దీంతో ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నుడా నిర్ణయం సక్రమంగా అమలు జరుగుతుందా రాజకీయ నేతల జోక్యంతో పక్కకు పోతుందా చూడాలి.
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌
నుడా పరిధిలో రెండు ఎన్‌ఫోర్స్‌మెంట్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. బి. ప్రసన్నకుమార్‌ (కావలి, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు, కొడవలూరు) డి. సూర్యనారయణ (నెల్లూరు, టిపి గూడూరు) జె. పార్దసారధి (కోవూరు, ఇందుకూరుపేట )ఐ.రఘు (వెంకటాచలం)టి. ప్రసాద్‌ (ముత్తుకూరు)ను నియమించారు. వీరికి టీమ్‌ లీడర్‌గా అంకయ్య ఎడిఎం నుడాను నియమించారు. రెండో టీమ్‌గా ఎస్‌కె కాలీమ్‌ (బుచ్చిరెడ్డిపాళెం, మనుబోలు) జి.రమేష్‌ (తడ, వరదాయపాళెం, సత్యవేడు )కె. నాగరాజు (చిల్లకూరు, ఓజిలి, నాయుడుపేట) కె. కిశోర్‌ (దొరవారిసత్రం, సూళ్లూరుపేట)ను నియమించారు. పెంచలయ్య ఎడిఎం నుడాను టీమ్‌ లీడర్‌గా నియమించారు.