Oct 27,2021 22:22

పంట పొలాలను పరిశీలిస్తున్న వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-అమలాపురం అల్లవరం మండలం గోడిలంకలో అక్రమ ఆక్వా చెరువుల వల్ల నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని, చెరువుల వల్ల నష్టపోతున్న పంట పొలాలను సాగులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రైతు నాయకులు రుద్రరాజు రవికుమార్‌ రాజు, రైతులతో కలిసి గ్రామంలోని ఆక్వా చెరువుల వల్ల నష్టపోతున్న పంట పొలాలను బుధవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆక్వా చెరువులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేస్తూ ఈనెల 11న కలెక్టర్‌ కార్యాలయం స్పందన కార్యక్రమంలో గోడిలంక గ్రామ రైతులు, సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేస్తామని చెప్పారు. మత్స్యశాఖ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకు, జిల్లా పొల్యూషన్‌ బోర్డ్‌ కంట్రోల్‌ కమిషన్‌కు రిజిస్టర్‌ పోస్టు ద్వారా వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. కానీ నేటికీ అధికార యంత్రాంగం ఏ విధమైన చర్యలు చేపట్టలేదన్నారు. గ్రామంలో విచ్చలవిడిగా అక్రమ ఆక్వా సాగు కొనసాగుతోందని, చెరువుల వల్ల వందలాది ఎకరాల్లో రైతులు పంట పొలాలు పంటలు పండక బీడుగా మారిపోతాయని, చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించి పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అక్రమ ఆక్వా చెరువుల వల్ల పంట పొలాలు, వాతావరణం మొత్తం కాలుష్యానికి గురవుతుందన్నారు. ఈ చెరువులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఏడుకొండలు, వాసర్ల నాగేశ్వరరావు, రొక్కాల సాయి, పిన్నమరాజు సుబ్బరాజు, రుద్రరాజు వెంకట రాజు, రుద్రరాజు గంగరాజు, వాసంశెట్టి ఏడుకొండలు, గాలి కృష్ణమూర్తి పాల్గొన్నారు.