Oct 26,2021 07:00

ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం 2020లో 94వ స్థానంలో ఉండేది. అక్కడి నుంచి మరింత దిగజారి 2021లో 101వ స్థానానికి చేరింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ కన్నా హీనమైన స్థానంలో ఇప్పుడు ఉంది. 'ఎందుకిలా మన దేశం దిగజారింది?' అన్నదానిని వివరించే బదులు, మోడీ ప్రభుత్వం ఆకలి సూచికను లెక్కించే పద్ధతినే సవాలు చేయడానికి పూనుకోవడం వెగటు పుట్టిస్తోంది. మన ప్రభుత్వం దేశంలో ఆకలి ఎందుకు పెరుగుతోందో, దానివెనుక కారణాలేమిటో గ్రహించలేకపోవడం అంతకన్నా దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
సరిగ్గా మన దేశం ఆకలి సూచికలో దిగజారుతున్న ఈ సమయం లోనే మన ఆహారధాన్యాల నిల్వలు అధికారికంగా అవసరమైన మోతాదు కన్నా ఎక్కువ స్థాయికి చేరుకున్నాయి. మనకు 2 కోట్ల 62 లక్షల టన్లు ఆహారధాన్యాల నిల్వలు ఉంటే సరిపోతుందని అధికారిక ప్రమాణాలు చెప్తున్నాయి. కాని ఈ సెప్టెంబరు 1వ తేదీకి మన దేశంలో 5 కోట్ల 2 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయి వున్నాయి. ఇలా ఎందుకు పేరుకుపోయాయి? ప్రజల దగ్గర తమ అవసరాలకు సరిపడా ఆహారాన్ని కొనుగోలు చేయగల ధనం లేకపోవడం వల్లే వారు ఆహారధాన్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొనుగోలు చేయలేకపోతున్నారని స్పష్టంగా కనిపిస్తూనే వుంది. కాని ప్రభుత్వం వాదన వేరేగా ఉంది. ఇంతగా అదనపు నిల్వలు పేరుకు పోయి వున్నాయంటేనే దేశంలో ఆకలి అనేది ఉండడం అవాస్తవం అని, ఆకలి సూచిక లెక్కలు తప్పని ప్రభుత్వం వాదిస్తోంది.
ఒకానొక స్థాయిలో ధరలు, ప్రజల కొనుగోలుశక్తి ఉన్నప్పుడు, ఆహారధాన్యాల నిల్వలు పేరుకుపోవడం, ఇంకోపక్క ప్రజలు ఆకలితో మాడిపోవడం జరుగుతోందంటే ఆహారధాన్యాల ధరలను తగ్గించడం అనేదే ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది. లేదా, ప్రజల కొనుగోలు శక్తినైనా పెంచే చర్యలను తీసుకోవాలి. నిజానికి ఎందరో ఆర్థికవేత్తలు, పౌర సంస్థలు, వామపక్ష రాజకీయ పార్టీలే కాకుండా, ఇతర రాజకీయ పార్టీలు సైతం ప్రజల కొనుగోలుశక్తిని పెంచడానికి నగదు బదిలీ వంటి చర్యలను చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూనే వున్నాయి. ఆ విధంగా చేయడానికి అవసరమైతే ద్రవ్యలోటును పెంచడానికైనా సిద్ధపడాలని సూచిస్తున్నాయి. అదనపు ఆహార నిల్వలు ఉన్న నేపథ్యంలో, పరిశ్రమల స్థాపక సామర్ధ్యం పూర్తి వినియోగంలోకి రాని పరిస్థితుల్లో, ఆవిధంగా నగదు చెల్లింపులు చేసినందువలన ద్రవ్యోల్బణం పెరుగుదలకు అది పెద్దగా దారితీయక పోవచ్చునని కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నారు. కాని ఇప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దానికి కారణమేమిటి? ప్రభుత్వం పెట్రో పన్నులు వంటి పరోక్ష పన్నులను పెంచడం ద్వారా ప్రజల కొనుగోలుశక్తిని మరింత హరిస్తోంది. తద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుని ద్రవ్యలోటును తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. దానికి బదులు ద్రవ్యలోటును పెంచి, పరోక్ష పన్నులను తగ్గించి, ప్రజలకు అదనపు ఆదాయాన్ని చేకూర్చే చర్యలను చేపట్టడం అవసరం. ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే ప్రభుత్వానికి ఉన్నది అదొక్కటే మార్గం.
కాని మోడీ ప్రభుత్వం తీరే వేరు. ఒక మొద్దబ్బాయి తన హెడ్మాస్టరు ఇచ్చే ఆదేశాలను ఏ విధంగా ఆచరిస్తూపోతాడో, అదే విధంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కోరుకున్న విధంగా మన ద్రవ్యలోటును తక్కువ స్థాయిలో ఉంచడానికే ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు ఏ విధమైన నగదు బదిలీలనూ చేయకుండా వుంది. దాని వలన అతి హీనమైన స్థాయిలో ప్రజల కొనుగోలు శక్తి ఉంది. ఇప్పుడు మనం ఒకదానికొకటి ఏమాత్రమూ పొసగని మూడు ధోరణులను మన ఆర్థిక వ్యవస్థలో ఒకేసారి చూస్తున్నాం. తీవ్రమైన ఆకలి, అవసరానికి మించి వున్న ఆహార నిల్వలు, అయినా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం. కాని, చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేని ఈ ప్రభుత్వం మాత్రం కనీసం ఈ మూడు ధోరణులు ఉన్నాయని కూడా గుర్తించలేకపోతోంది. అందుచేత తీవ్రమైన ఆకలి ఉన్నదని అంగీకరిచడానికి నిరాకరిస్తోంది. ''ఒక గొప్ప రక్షకుడు నాయకత్వం వహిస్తుండగా ఇటువంటి పరిస్థితి నెలకొనడం అసాధ్యం'' అనే బిజెపి-స్టైల్‌ ప్రచారార్భాటం ఈ నిరాకరణకు కారణం అని అనుకుంటే పొరపాటు. అదొక్కటే కారణం కాదు. సరళమైన ఆర్థిక సూత్రాలను సైతం అర్ధం చేసుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా ఒక కారణం.
ప్రజల ఆకలిని ఈ ప్రభుత్వం గుర్తించడం లేదు. ఆహార ధాన్యాల ఎగుమతులు ఇటీవల కాలంలో పెరిగాయి. అయినప్పటికీ ఇంకా నిల్వలు పేరుకుపోయి వున్నాయి. వీటిని ఏదోఒక విధంగా తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బయో ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడం అటువంటి ఒక తాజా ప్రయత్నం. భూ నిక్షేపాల నుండి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని తగ్గించి దాని స్థానంలో బయో ఇంధనం ఎథనాల్‌ ను ప్రోత్సహించాలన్న ధోరణి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. దీనివలన పర్యావరణానికి కలుగుత్ను హానిని తగ్గించవచ్చునన్నది ఆ ధోరణి వెనుక ఆలోచన. అందుచేత గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఎథనాల్‌ ఉత్పత్తి కోసం ఆహారధాన్యాలను మళ్ళిస్తున్నారు. అమెరికాలో మొక్కజొన్నలను ఎథనాల్‌ ఉత్పత్తికి చాలా ఎక్కువగా వినియోగి స్తున్నారు. ఐతే దానివలన అమెరికాకు వచ్చే ఇబ్బందేమీ లేదు. ప్రపంచ ఆకలి సూచికలో అమెరికా ఎక్కడా లేదు. అందుచేత ప్రజల ఆకలి ఒక సమస్య గా ఆ దేశానికి లేదు. కాని మన మోడీ ప్రభుత్వం అమెరికాకు తీసిపోకూడదన్నట్టు ఎథనాల్‌ ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టి దానిని పెట్రోలుతో కలిపి ఆ మిశ్రమాన్ని వినియోగించేలా ప్రోత్సహించనున్నట్టు అట్టహాసంగా ప్రకటించింది. పెట్రోలులో 20 శాతం ఎథనాల్‌ ను కలిపి వినియోగించనున్నట్టు, అందుకు అవసరం అయ్యే ఎథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి బియ్యాన్ని, చెరుకును ఉపయోగించనున్నట్టు ప్రకటించింది.
ఈ విధంగా చేయడంలో భారతదేశానికి ఎటువంటి ఇబ్బందీ లేదని, దేశంలోని ప్రభుత్వ ఆహార గిడ్డంగులలో చాలినంత నిల్వలు ఉన్నాయని, అందుచేత దేశ ఆహార భద్రతకు ఎటువంటి ముప్పూ వాటిల్లబోదని ఒక సీనియర్‌ ప్రభుత్వ అధికారి ప్రకటించారు. తక్కిన ప్రభుత్వ ప్రకటనల మాదిరిగానే ఈ ప్రకటన కూడా ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వ అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తోంది. ఆకలిగొన్న ప్రజల పేదరికానికి నిదర్శనంగా ఈ పేరుకుపోయిన ఆహారధాన్యాల నిల్వలను పరిగణించడం పోయి దేశ సుభిక్షత కు సంకేతంగా పరిగణిం చడం ఆ అజ్ఞానాన్ని సూచిస్తోంది. ఇదే తరహా ఆలోచనతో ప్రభుత్వం గనుక ఉన్నట్టైతే, రేపు ఒకవేళ దేశంలో కరువు పరిస్థితి ఏర్పడినా, దానిని కూడా ఈ ప్రభుత్వం గుర్తించడానికి సిద్ధపడదు. 'ఆహారధాన్యాల నిల్వలు ఉన్నప్పుడు కరువు ఉందని ఎలా చెప్తారు ఎవరైనా?' అని ఎదురు ప్రశ్నిస్తుంది.
ఆలోచనావంతులెవరైనా సరే, దేశంలో ఆహారధాన్యాల నిల్వలను ఈ విధంగా ఎథనాల్‌ ఉత్పత్తి వైపు మళ్ళించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. దానికి బదులు అదనపు ఆహారధాన్యాలను ప్రజలకు అందేవిధంగా వారి కొనుగోలుశక్తిని పెంచాలని డిమాండ్‌ చేయాలి. అప్పుడే దేశం ఆకలి కోరల్లోంచి బైటపడుతుంది. ఇక చెరుకును ఎథనాల్‌ ఉత్పత్తికి మళ్ళించడం వలన దేశంలో భూవినియోగం ఆహారధాన్యాల ఉత్పత్తి వైపు నుండి చెరుకు పంట వైపు మళ్ళుతుంది. పర్యవసానంగా దేశం లో తలసరి ఆహారధాన్యాల లభ్యత తగ్గిపోతుంది.
ఆ విధంగా తలసరి ఆహారధాన్యాల లభ్యత తగ్గిపోయిన ప్పటికీ, ఇంకా దేశంలో మిగులు ఆహార ధాన్యాలు ఉంటాయి. ఇదెలా సాధ్యం? నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో నిరంత రం ఆహారధాన్యాల మిగులు కొనసాగుతూనే వుంటుంది. ఒకవైపు తలసరి ఆహారధాన్యాల లభ్యత తగ్గిపోయినప్పటికీ, ఈ మిగులు కొనసాగుతుంది. ఏమిటి కారణం?
ఆహారధాన్యాల నిల్వలు కనీస స్థాయికన్నా తగ్గిపోతే అప్పుడు వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అప్పుడు ద్రవ్య పెట్టుబడి చేతుల్లో ఉండే ఆస్థుల (షేర్లు, స్టాకులు, బాండ్లు వగైరా) విలువ పడిపోతుంది. తమ ఆస్థుల విలువ పడిపోకుండా చూడాలని ద్రవ్య పెట్టుబడి ప్రభుత్వం మీద వత్తిడి పెంచుతుంది. అప్పుడు ప్రభుత్వం దేశంలో ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తుంది. అందుకోసం ప్రభుత్వం చేసే వ్యయం తగ్గించుకుంటుంది. అదే ఆహార ధాన్యాల నిల్వలు కనీస స్థాయి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నిల్వలను తగ్గించడానికి వీలుగా తన వ్యయాన్ని పెంచే చర్యలను తీసుకోదు. పొంతన లేని ఈ విధానాల వలన సాధారణంగా దేశంలో ఎప్పుడూ ఆహారధాన్యాల మిగులు కొనసాగుతూనే వుంటుంది (ప్రజల ఆకలి తో నిమిత్తం లేకుండా).
ఒకవేళ ఆహారధాన్యాల నిల్వలు కనీస స్థాయికన్నా తగ్గిపోతే ఆ పరిస్థితిని అధిగమించడానికి రెండు దారులు ఉన్నాయి. మొటిది: ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచడం. దానివలన సరఫరా పెరుగుతుంది అప్పుడు మళ్ళీ నిల్వలు పెరుగుతాయి. ఇక రెండో మార్గం: డిమాండును తగ్గించడం. అందుకోసం ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించడం, ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేయడం. ఈ చర్యలు ప్రజల కొనుగోలుశక్తిని తగ్గించడానికి దారితీస్తాయి. ఈ రెండో మార్గాన్ని అనుసరించడమే ప్రభుత్వానికి తేలిక. మొదటి మార్గంలో ఫలితాలు రావడం ఆలస్యం అవుతుంది. అందుకోసం అవసరమైన అదనపు ప్రభుత్వ పెట్టుబడిని పెట్టడానికి కూడా సమయం పడుతుంది. ఈ కారణాల వలన నయా ఉదారవాద వ్యవస్థలో ప్రజల కొనుగోలుశక్తి పడిపోతూనే వుంటుంది.తలసరి ఆహారధాన్యాల ఉత్పత్తి, దానితోబాటు తలసరి ఆహారధాన్యాల లభ్యత కూడా పడిపోతూ వుంటుంది. దాని పర్యవసానంగా ఆకలి తీవ్రత పెరుగుతూ వుంటుంది.
అంటే ఒకవైపు తలసరి ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోతున్నా, తలసరి ఆహార ధాన్యాల లభ్యత పడిపోతున్నా, ఆకలిగొన్న ప్రజల సంఖ్య పెరుగుతూ వున్నా, ఇంకోవైపు ఆహారధాన్యాల నిల్వలు పెరుగుతూనే వుంటాయి. నయా ఉదారవాద పాలనలో మిగులు ఆహార ధాన్యాల నిల్వలు ఉండడం అనేది ప్రజలలో ఆకలి లేకపోవడాన్ని సూచించదు. వాస్తవానికి నయా ఉదారవాద విధానాల వలన ఆకలి గొనే ప్రజల సంఖ్య పెరగడంతోబాటు ఆహార నిల్వలు కూడా పెరుగుతాయి.
ఆహారధాన్యాలను బయో ఇంధనాల ఉత్పత్తికి మళ్ళిస్తే అందువలన ఈ పరిస్థితి మరింత జటిలమౌతుంది. బియ్యానికి బదులు చెరుకును ఎథనాల్‌ తయారీకి వినియోగించినా, దాని వలన భూ వినియోగంలో వచ్చే మార్పు వలన తలసరి ఆహారధాన్యాల లభ్యత ఇంకా తగ్గుతుంది.
బియ్యాన్ని, చెరుకును ఎథనాల్‌ తయారీకి మళ్ళించాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు తలసరి ఆహారధా న్యాల లభ్యతను తగ్గించడమే గాక ఇటు ప్రజల ఆకలినీ పెంచుతుంది. ఒకసారి ఈ మళ్ళింపు వలన ఆహారధాన్యాల నిల్వలు కనీస స్థాయి కన్నా తగ్గడం మొదలవగానే ప్రజల కొనుకోలు శక్తిని మరింత తగ్గించడం మొదలౌతుంది. తద్వారా ఆహారధాన్యాల నిల్వలు కనీస స్థాయి కన్నా పడిపోకుండా నిలబెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆకలిగొన్న ప్రజల సంఖ్య మరింత పెరుగుతుంది.
ఈ విధానం పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సంపన్న దేశాలలో పర్యావరణహిత ఇంధనం పట్ల ఆసక్తి పెరిగింది. అక్కడి అభ్యుదయవాదులు సైతం దానిని ఆహ్వానిస్తున్నారు. నిజమే. కాని ఆ సంపన్న దేశాల విధానాన్ని, దాని పర్యవసానాలతో నిమిత్తం లేకుండా మన వంటి మూడవ ప్రపంచ దేశాలలో అమలు చేయబూనుకోవడం వినాశకర ఫలితాలకు దారితీస్తుంది. దేశ ప్రజల ఆకలి తీవ్రతను పెంచుతుంది.
                                 ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం 2020లో 94వ స్థానంలో ఉండేది. అక్కడి నుంచి మరింత దిగజారి 2021లో 101వ స్థానానికి చేరింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ కన్నా హీనమైన స్థానంలో ఇప్పుడు ఉంది. 'ఎందుకిలా మన దేశం దిగజారింది?' అన్నదానిని వివరించే బదులు, మోడీ ప్రభుత్వం ఆకలి సూచికను లెక్కించే పద్ధతినే సవాలు చేయడానికి పూనుకోవడం వెగటు పుట్టిస్తోంది. మన ప్రభుత్వం దేశంలో ఆకలి ఎందుకు పెరుగుతోందో, దానివెనుక కారణాలేమిటో గ్రహించలేకపోవడం అంతకన్నా దిగ్భ్రాంతి కలిగిస్తోంది.    - ప్రభాత్ పట్నాయక్ ( స్వేచ్ఛానుసరణ )