Jan 11,2021 15:48

పుల్లంపేట (కడప) : దేశవ్యాప్తంగా ఏ ఆలయంలోనైనా ఆడవారు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. అటుంటిది ఈ ఆలయంలో పురుషులే పొంగళ్లు పెట్టడం వింత గొలిపే ఆచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె సంజీవరాయ ఆలయంలలో పురుషులే పొంగళ్ళు పెట్టడం ప్రత్యేక ఆచారంగా తరతరాలుగా కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు వచ్చే ముందు ఆదివారం ఆ గ్రామంలో పురుషులు మాత్రమే ఆలయంలో పొంగళ్లు పెట్టి, మహిళలకు పెట్టకుండా.. వారు చేసిన ప్రసాదాన్ని వారే తినేస్తారట. ఈ ఆలయంలోకి మహిళలు రావడం పూర్తిగా నిషేధం. అయితే ఆలయ ప్రాంగణానికి వెలుపల నుంచే సంజీవరాయునికి మొక్కుకొని మహిళలు తిరుగు పయనమవుతుంటారు. అసలు సంజీవరాయునికి ప్రత్యేకించి ఆలయమంటూ లేదు. ఒక రాతిశిలపై ఉన్న లిపినే ఇక్కడ సంజీవరాయునిగా ప్రజలు కొలుస్తున్నారు. గ్రామంలో పంటలు బాగా పండకపోవడంతో ఓ బ్రాహ్మణుడు లిపితో ఇచ్చిన రాయిని ప్రతిష్టించి, సంజీవరాయునిగా కొలిచి పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన ఉద్యోగస్తులు ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారంతా అక్కడికి చేరుకుని తమ పూర్వీకుల నుంచి వస్తోన్న సంప్రదాయానికి అనుగుణంగా పొంగళ్లు పెట్టుకుంటున్నారు. ఆ ఊరి ప్రజలు సంక్రాంతి పండుగకన్నా.. ఈ సంజీవరాయుని పొంగళ్లు పెట్టుకోవడమే పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇక ఆ మండలం నుంచే కాకుండా.. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పురుషులు స్వామి వారిని దర్శించుకుని కొబ్బరి, బెల్లాన్ని కానుకలుగా సమర్పిస్తుంటారు.