Jan 09,2021 22:44

అకాల వర్షంతో నల్లగా మారిన జొన్నకంకి

- నల్లగా మారిన జొన్నకంకి
- తల్లడిల్లుతున్న రైతన్న
ప్రజాశక్తి - చిప్పగిరి:
 ఈఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఏ పైరు వేసినా బాగా ఉంటుందని, మంచి రాబడి పొందవచ్చని రైతులు ఎంతో ఆశపడ్డారు. వారి ఆశలపై అకాల వర్షం నీళ్లు పోసింది. ముఖ్యమైన ఆహార ధాన్యం జొన్న పైరు రంగుమారి బూడిద రంగులో కనబడుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ఈ అకాల వర్షాలతో నష్టపోయి మనోవేదనకు గురవుతున్నారు. అలాగే పప్పు శనగ, వాము, పైరు మీద ఉన్న పత్తి, పొద్దుతిరుగుడు పంటలు ఈ అకాల వర్షాలకు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. వాము వేసిన రైతులు భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. వర్షానికి వాము అంతా నల్లగా మారడంతో మార్కెట్లో ధర ఉండదని రైతులు భయపడుతున్నారు. రైతులకు ఏదో ఒక రూపంలో నష్టం వాటిల్లుతూనే ఉంది. పంటలు వేసుకొని నష్ట పోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.