Oct 10,2021 12:25

అజ్ఞానంలో జీవించే అమాయక ప్రజలు, వారిని మేల్కొలిపేందుకు వచ్చే ఒక హీరో అనే కథాంశంతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే హీరో స్థానంలో రేడియోను వాడుకోవడమే ఈ కథలో కొత్తదనం. నాగరికతకు దూరంగా ఉండే గిరిజనులు.. అక్కడి వారిపై దొర సాగించే అరాచకాలు, ప్రజల అమాయక జీవనంతో పాటు, కొండ కోనలు, అడవి అందాలతో కొద్దిసేపు మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది 'ఆకాశవాణి'. సోనీలివ్‌లో నేరుగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!

    థలోకి వెళ్తే... నాగరిక ప్రపంచానికి దూరంగా కొండకోనల్లో ఉండే ఓ గూడేనికి చెందిన అమాయక గిరిజనుల వ్యథ ఇది. అక్కడి జనానికి దొర (వినరు వర్మ) మాటే శాసనం. అక్కడే ఒక చెట్టు తొర్రలో ఉండే బండరాయిని దైవంగా భావించి, పూజలు చేస్తుంటారు. తమను దారుణంగా దండించే దొర.. దేవుడి ఆజ్ఞ ప్రకారమే అలా చేస్తున్నాడని గూడెం వాసులంతా పిచ్చిగా నమ్ముతుంటారు. ఆ బండరాయి తర్వాత వాళ్లను బతికించేది, శాసించేది దొరేననేది వారి బలమైన నమ్మకం. గూడెం హద్దు దాటి బయట అడుగుపెడితే దేవుడు కఠినంగా శిక్షిస్తాడని, ప్రాణాలనూ హరిస్తాడనే భయాన్ని దొర వారిలో నూరిపోస్తాడు. ఆ భయాన్నే పెట్టుబడిగా పెట్టి, తోటల్లో పనిచేయిస్తూ వాళ్ల శ్రమను దోచుకుంటాడు. బయటి నుంచి ఎవరైనా ప్రవేశించే ప్రయత్నాలు చేసినా, లోపలున్న వాళ్లలో ఎవరైనా దొర గీసిన హద్దులు దాటాలని చూసినా వారి నెత్తురు కళ్లజూస్తాడు. కఠినమైన ఆంక్షల మధ్య అమాయకంగా బతుకుతున్న వారి జీవితాల్లోకి మరో దేవుడు అవతరిస్తాడు. అయితే బండరాయి రూపంలోనో, మనిషి రూపంలోనో కాదు. మాట్లాడే రేడియో ఆ బండరాయి స్థానంలో వచ్చి చేరుతుంది. అనుకోకుండా అదే గూడెంలోని గిడ్డడు (మాస్టర్‌ ప్రశాంత్‌) కి దొరికిన రేడియోని బండరాయి స్థానంలో ఉంచుతాడు. ఇది తెలియని గూడెం వాసులు దాన్నీ దేవుడిగానే భావించి, కొలుస్తుంటారు. దేవుడు తమ బాధలను తీర్చేందుకు సరికొత్త రూపంలో అవతరించాడని భ్రమ పడతారు. దీంతో ఆ రేడియో వల్ల వాళ్ల గూడెంలో అల్లకల్లోలం చెలరేగుతుంది. అలాంటివారి జీవితంలోకి చంద్రం మాస్టర్‌ (సముద్ర ఖని) వస్తాడు. తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? చీకట్లో బతుకుతున్న ఆ గూడెం ప్రజల్లో చైతన్యం ఎలా కలిగింది? మరో దేవుడు అక్కడ సెటిలవ్వటం ఇష్టం లేని దొర ఏం చేస్తాడు..? వారి అజ్ఞానం తొలిగిపోయి, దొర అరాచకత్వం ఎలా బయటపడిందనేది మిగతా కథ.
      వ్యవస్థను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న దొరలకు బానిసగా బతుకీడుస్తున్న వారు ఇప్పటికీ ఉన్నారా అనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూస్తే 1980లో వచ్చిన 'ది గాడ్స్‌ మస్ట్‌ బీ క్రేజీ' అనే ఆఫ్రికన్‌ మూవీ సీరిస్‌ గుర్తొస్తుంది. గూడెం జనాల అమాయకత్వం, రక్త సంబంధీకులతో బంధం తెగిపోయినప్పుడు దేవుడి మీదనే భారం వేయడం, గూడెంలోని మనిషి కనుమరుగు కాగానే దీపంగా మారిపోయాడని భావించడం, దొర దాష్టికం తెలిసినా మౌనంగా భరించడం లాంటివి చూస్తుంటే.. ఈ తరహా జనాలు ఇంకా ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. రేడియోను దేవుడిగా భావించే వారికి హిరణ్యకశ్యపుడు-ప్రహ్లాద గాథ ద్వారా చంద్రం మాస్టరు వాస్తవాన్ని తెలియజెప్పడం ఆసక్తికరమైన అంశం. అదే సమయంలో దొర చావుకు కూడా ఆ పౌరాణిక గాథను ముడి పెట్టడం బాగుంది.
     'ఆకాశవాణి'లో నటించిన వారంతా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అందరూ తమ సహజ నటనతో సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చారు. మేకలు కాసే గిడ్డాగా మాస్టర్‌ ప్రశాంత్‌, అతడి తండ్రి రంగడిగా మైమ్‌ మధు హావభావాలతో ఆకట్టుకున్నారు. దొరగా వినరువర్మ, చంద్రం మాస్టరుగా సముద్రఖని ఒదిగిపోయారు. గూడెంలో అందరినీ భయపెట్టే సాంబడిగా తేజ కాకమాను నటన బాగుంది. విక్రమార్కుడులో అజరు పోషించిన టిట్లా పాత్రను గుర్తుచేశాడు. సముద్రఖని, గెటప్‌ శీను పాత్రలను మరింత పకడ్బందీగా తీసుకురావాల్సింది. సముద్రఖని తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. సాయిమాధవ్‌ బుర్ర రాసిన డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. సురేశ్‌ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే ప్రధానంగా ఈ సినిమాలో గిరిజనుల అమాయకత్వం ప్రేక్షకుడిని సినిమాతో పాటే ప్రయాణించేలా చేస్తోంది. అడవిని చక్కగా చూపించారు. కాల భైరవ అందించిన పాటలు బాగున్నాయి. బిజిఎం కూడా సినిమాకు తగినట్లుగానే ఉంది. సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా సినిమా బాగుంది. రాజమౌళి శిష్యుడైన అశ్విన్‌ గంగరాజు మొదటి సినిమాకే ఇలాంటి భిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం అభినందనీయం. కథగా ఎంచుకున్న పాయింట్‌ ఆకట్టుకున్నప్పటికీ, దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలో కాస్త తడబడ్డాడు. అయితే ఇలాంటి కథలను డీల్‌ చేయడం కత్తి మీద సామే. మొత్తానికి దర్శకుడు తాను చెప్పాలనుకున్న అంశాన్ని ముగింపులో ప్రభావవంతంగానే చెప్పారు.


చిత్రం: ఆకాశవాణి
నటీనటులు: సముద్రఖని, వినరు వర్మ, మైమ్‌ మధు, తేజ కాకుమాను, మాస్టర్‌ ప్రశాంత్‌ తదితరులు
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: సురేశ్‌ రగుతు
ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాత: పద్మనాభరెడ్డి
రచన, దర్శకత్వం: అశ్విన్‌ గంగరాజు
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా
ఓటీటీ : సోనీలివ్‌
విడుదల: 24-09-2021