Oct 28,2021 20:54

ఏడాదికి రూ.9,713 కోట్ల విరాళం
దాతృత్వలో మూడో స్థానంలో ముకేష్‌ అంబానీ

ముంబయి : దాతృత్వంలో విప్రో గ్రూపు అధిపతి అజీమ్‌ ప్రేమ్‌జీ అగ్రస్థానంలో ఉన్నారు. రోజుకు ఆయన సగటున రూ.27 కోట్ల సాయం చేస్తున్నారు. హురన్‌ ఇండియా, ఎడెల్‌గివ్‌ వార్షిక ఎడెల్‌గివ్‌ హురన్‌ ఇండియా ఫిలాంథ్రోపీ జాబితా 2021ను విడుదల చేసింది. ఈ తరహాలో జాబితా విడుదల చేయడం ఇది 8వ సారి. ఈ దాతలు 2020 ఏప్రిల్‌ నుంచి మార్చి 2021 మధ్య కాలంలో చేసిన నగదు లేదా ఆ మొత్తానికి సమానమైన విరాళాలను ఈ జాబితాలో గుర్తించారు. ఏడాదికి రూ.5 కోట్లు లేదా అంతకు మించి విరాళం అందించిన వారిని పరిశీలనలోకి తీసుకున్నారు. ఏడాదిలో అజీమ్‌ ప్రేమ్‌జీ అత్యధికంగా రూ.9,713 కోట్ల విరాళం అందించి అగ్రస్థానంలో నిలిచారు. హెచ్‌సిఎల్‌ శివ్‌ నాడార్‌ రూ.1263 కోట్ల విరాళంతో ద్వితీయస్థానంలో నిలిచారు. దేశంలోనే అతి సంపన్న వ్యక్తి ముకేష్‌ అంబానీ దాతృత్వానికి రూ.577 కోట్లు కేటాయించడంతో మూడో స్థానంలో ఉన్నారు. జెరోఢా వ్యవస్ధాపకులు నితిన్‌ కామత్‌, నికిల్‌ కామత్‌లు రూ.25 కోట్ల విరాళంతో ఈ జాబితాలో తొలిసారిగా చోటు సంపాదించారు. హెటిరో డ్రగ్స్‌కు చెందిన పార్థసారథ రెడ్డి కుటుంబం తమ విరాళాలను 300 శాతం పెంచి రూ.67 కోట్లను ఖర్చు చేశారు. ఈ ఏడాది మొత్తంగా 72 మంది దాతలు రూ.9,659 కోట్లు విరాళంగా అందించారు. అందరికీ అతి ముఖ్యమైన కారణంగా విద్య నిలిచింది. 60 మంది దాతలు విపత్తుల ఉపశమనం, నిర్వహణ కోసం దానం చేశారు. దీని తరువాత ఆరోగ్య సంరక్షణ ఉంది.