Dec 04,2021 03:14

సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న చిన్నయ్య పడాల్‌

ప్రజాశక్తి - పాడేరు : ఐటిడిఎలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు 45 ఫిర్యాదులు వచ్చాయి. ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌ సంయుక్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారుల నిర్మాణాలు, సిసి రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలకు అధికంగా విజ్ఞప్తులు వచ్చాయి. హుకుంపేట మండలం మర్రిపుట్టు గ్రామానికి చెందిన జి.మత్స్యరాజు ఉపాధి వేతనాలు చెల్లించాలని వినతిపత్రం సమర్పించారు. పాడేరు మండలం కొత్తపాడేరు గ్రామానికి చెందిన పొంగి దేవయ్య వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. అరకు వ్యాలీ మండలం కొత్త భల్లుగూడ గ్రామస్తులు ఎస్‌.అర్జున్‌, డి.రామన్న కొత్త భల్లుగూడ సమీపంలో గౌడు గెడ్డ వద్ద అక్రమంగా టెంట్లు నిర్వహిస్తున్నారని వాటిని తొలగించాలని ఫిర్యాదు చేశారు. చింతపల్లి మండలం ఎర్రబొమ్మలు గ్రామం వద్ద జియో సెల్‌ టవర్‌ నిర్మించాలని గ్రామస్తుడు ఎస్‌.సత్తిబాబు కోరారు. చింతపల్లి మండలం గంధాలవీధి, పెడకొండ, సతాయి, కుడుములు గ్రామాలలో సిసి రోడ్లు నిర్మించాలని గ్రామస్తులు వి.రాజేష్‌ పాల్‌, కె.రమేష్‌, కె.లావణ్య తదితరులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు జి.విజయ కుమార్‌, ఎస్‌ఇ ఎస్‌.శ్రీనివాస్‌, ఇఇడి విఆర్‌ఎం.రాజు, పంచాయతీరాజ్‌ ఇఇ మాలకొండయ్య, ఆర్‌అండ్‌బి ఇఇ బాల సుందరరావు తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు కుల ధ్రువపత్రదారులపై చర్యలు తీసుకోవాలి
ఏజెన్సీలో తప్పుడు కుల ధ్రువపత్రాలతో చలామణి అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు చిన్నయ్య పడాల్‌, ధనుంజరు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆధారాలతో కూడిన ఫిర్యాదును సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌కు అందించారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, హక్కులకు తూట్లు పొడుస్తూ ఎస్‌సి సామాజిక తరగతికి చెందిన జల్లి సుధాకర్‌ తప్పుడు ధ్రువీకరణ పత్రాన్ని పొంది గిరిజనులకు చెందిన రాజకీయ రిజర్వేషన్లతో పాటు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారని తెలిపారు. విచారణ జరిపి షెడ్యూల్‌ తెగల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
తప్పుడు పట్టాను రద్దు చేయండి
చింతపల్లి మండలంలో వంతమామిడి గ్రామానికి చెందిన గ్రామకంఠం భూమిని 1/70 చట్టాన్ని ఉల్లంఘించి ఇచ్చిన పట్టాను రద్దు చేయాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాలికి లక్కు, ఉపాధ్యక్షులు పాంగి ధనంజరు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఐటిడిఎలో జరిగిన స్పందన కార్యక్రమంలో పిఒ రోణంకి గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌లకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దలు బోనంగి పెద్దబ్బాయి పడాల్‌, చంటి పడాల్‌, రవి కుమార్‌ చిన్నబ్బాయి, వినోద్‌ వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు.