
అహ్మదాబాద్ : భారతజట్టు నాల్గో టెస్ట్‌లోనూ గెలిచి ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దూసుకెళ్ళడం ఖాయమని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. మొతేరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్‌ను భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో చివరి టెస్ట్‌ను కనీసం డ్రా చేసుకున్నా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుందన్నాడు. మూడో టెస్ట్ ఫలితం కేవలం 842 బంతుల్లోనే వచ్చిందని, ఇలా గెలిచింది రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇదే తొలిసారని అన్నాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన ఆసియాఖండ పిచ్‌లపై రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కలిసి డే/నైట్ టెస్ట్‌లో 18 వికెట్లు తీయడం విశేషమన్నాడు. దీంతో తమజట్టు రెండు ఇన్నింగ్స్‌లో కలిపి(112, 81) 200 పరుగులు కూడా చేయలేకపోయిందన్నాడు. 2012-13లో అలెస్టర్ కుక్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్ గెలిచిందని, ఆ తర్వాత మళ్ళీ భారత్ వేదికపై తమజట్టు గెలిచిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా కాంప్టన్ చెప్పుకొచ్చాడు. మూడోటెస్ట్ పరాజయంతో ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ రేసునుంచి నిష్క్రమించిందని, ఈ క్రమంలో భారత్-న్యూజిలాండ్ జట్లమధ్యే ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగడం ఖాయమన్నాడు. కాంప్టన్ ఇంగ్లాండ్ తరఫున 16 టెస్టుల్లో 28.70 యావరేజ్‌తో 775 పరుగులు చేశాడు.
వన్డే, టి20 సిరీస్‌లకు బుమ్రా దూరం: బిసిసిఐ
వ్యక్తిగత కారణాలతో నాల్గోటెస్ట్కు దూరమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వన్డే, టి20 సిరీస్‌కు దూరం కానున్నాడు. టీమిండియా ఈ ఏడాది బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కొంతకాలం గడిపేందుకు మూడోటెస్ట్ అనంతరం జట్టుకు దూరంగా ఉంటానని బుమ్రా బిసిసిఐకి తెలిపాడు. దీంతో బయోబబుల్ బుడగను అతిక్రమించి కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ఐపిఎల్, భారతజట్టు ఇంగ్లాండ్ పర్యటన, టి20 ప్రపంచకప్ వెంట వెంటనే జరగనున్న నేపథ్యంలో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని బిసిసిఐ వెల్లడించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ మార్చి 23 నుంచి పుణెలో జరగనున్న విషయం తెలిసిందే.
ఫిట్నెస్ టెస్ట్‌లో వరుణ్ ఫెయిల్
టీమిండియా యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిట్నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా మంగళవారం వెల్లడించింది. బిసిసిఐ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు ఫిట్నెస్ టెస్ట్ పాసవ్వాలంటే 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్లు పరుగెత్తాలి లేదంటే యోయో టెస్ట్‌లో 17.1 స్కోరైనా సాధించాలి. మూడు నెలల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న వరుణ్.. ఈ మార్క్ అందుకోవడంలో ఫెయిలయ్యాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోసం వరుణ్‌ను ఇప్పటికే టీమ్‌లోకి ఎంపిక చేశారు. టి20 సిరీస్‌కు మరో 10 రోజులు ఉండటంతో వరుణ్ చక్రవర్తిని మరోసారి యోయో టెస్ట్‌కు పంపించే అవకాశాలున్నాయి.
నినినినిా