May 04,2021 09:39
  • భయపడుతున్న ఆటగాళ్లు
  • కరోనాతో బెంగళూరు, నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ వాయిదా
  • కోల్‌కతా ఆటగాళ్లు ఇద్దరు, చెన్నై బౌలింగ్‌ కోచ్‌కు కోవిడ్‌

అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌ (ఐపిఎల్‌)లో మరోసారి కరోనా కలకలం రేపింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లతో పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌ కరోనాబారిన పడ్డారు. దీంతో సోమ వారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లకు కరోనా సోకినట్లు తేలడంతో ఆర్సీబీ మ్యాచ్‌ ఆడటానికి సుముఖంగా లేదని తెలపడంతో బిసిసిఐ ఈ మ్యాచ్‌ను వాయిదా వేసింది. లీగ్‌ ప్రారంభానికి ముందు కూడా ఢిల్లీ ప్లేయర్‌ అక్షర్‌ పటేల్‌, ఇదే నైట్‌రైడర్స్‌కు చెందిన నితీష్‌ రాణా కూడా కోవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో కూడా పలువురు గ్రౌండ్‌ సిబ్బందికి కరోనా సోకింది. అయితే టోర్నీకి ముందే ప్లేయర్స్‌కు నెగటివ్‌గా తేలడంతో లీగ్‌ సజావుగా సాగుతోంది. ప్రస్తుతం ప్లేయర్స్‌ అంతా కఠినమైన బయోబబుల్‌లో ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్స్‌ తమ గాయాలకు స్కానింగ్‌ కోసం వెళ్లినప్పుడు కరోనా బారిన పడి ఉంటారని అనుమానిస్తున్నారు.


లక్ష్మీపతి బాలాజీకి కోవిడ్‌
చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ కూడా కరోనా బారిన పడ్డాడు. తాజాగా జరిపిన ఆర్టీపిసిఆర్‌ టెస్ట్‌లో బాలాజీకి కోవిడ్‌ సోకినట్లు ఆ ఫ్రాంచైజీ సోమవారం తేలింది. శనివారం ముంబయి-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా బాలాజీ చెన్నై ఆటగాళ్ళతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాడు. ఇక తాజాగా చెన్నైలో మరో ముగ్గురు ఆటగాళ్ళకు కోవిడ్‌ పరీక్షలు జరపగా నెగెటివ్‌ వచ్చింది. వారి పేర్లను మాత్రం ఫ్రాంచైజీ వెల్లడించలేదు. దీంతో అన్ని ఫ్రాంచైజీలు ఐపిఎల్‌ను తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

ఒకే వేదికపై ఐపిఎల్‌ ?
కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఒకే వేదికపై ఐపిఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. బయోసెక్యూర్‌ బబుల్‌లో ఐపిఎల్‌ను విజయవంతంగా నిర్వహించాలని బిసిసిఐ టోర్నీ ఆరంభానికి ముందే నిర్ణయించింది. లీగ్‌ ప్రారంభమై 25 రోజులు అవుతోంది. అనూహ్యంగా ఇద్దరు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో లీగ్‌ నిర్వాహకులతో పాటు ఫ్రాంఛైజీలు, క్రికెట్‌ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆటగాళ్లు కరోనా బారినపడడంతో నేడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. భారత్‌లో కరోనా ఉద్ధతి కొనసాగుతున్న సమయంలో లీగ్‌ నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పత్రికలు, ఛానెళ్లు విమర్శించాయి.