Apr 08,2021 15:02

విశాఖ: మోడీ నాయకత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఐక్యఉద్యమాలతో తిప్పి కొడదామని, తద్వారా ప్రభుత్వరంగ సంస్థలను రక్షించుకుందామని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్‌ పిలుపునిచ్చారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 7వ రోజు రిలే నిరాహారదీక్షలను ఆయన ప్రారంభించారు. ముఖ్య అతిధిగా పాల్గని మాట్లాడుతూ.. నరేంద్రమోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న చట్టాలను 4 లేబర్‌కోడ్‌లు గా మార్చి యజమానులకు నేరుగా సహకరిస్తోందని ఎద్దేవా చేశారు. దేశంలో వుండే సంపదను అంబానీ, అదానీ చేతుల్లో పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, అందులో భాగంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పాటు రక్షణరంగం, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఆయిల్‌రంగ పరిశ్రమలు , ఇన్యూరెన్స్‌, బ్యాంకులు వంటి ప్రభుత్వరంగ సంస్ధలను పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. రైతులకు నష్టదాయకమైన 3నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయరంగాన్ని నాశనం చేయడానికి పూనుకుందన్నారు. ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు పోరాడుతున్నా దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ నెల 18న ఢిల్లీలో పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న రైతు నాయకులు విశాఖకు వచ్చి స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు తమ మద్దతు ఇవ్వబోతున్నారని వెల్లడించారు. ఈ దీక్షా శిబిరంలో వేదిక చైర్మన్‌ ఎం. జగ్గునాయుడు అధ్యక్షత వహించారు. వేదిక కమిటీ సభ్యులు జి.వామనమూర్తి, ఎస్‌ కె. రెహమాన్‌, ఎం.మన్మధరావు, ఎ.సురేష్‌, జి ప్రియాంక, సిఐటియు నగర కార్యదర్శి పి.మణి, ఎం.సుబ్బారావు, వై.రాజు దీక్షలో కూర్చున్నవారికి పూలదండలు వేసి ప్రారంభించారు. 7వ రోజు దీక్షలో ఆరిలోవ సిఐటియు కార్యదర్శి వి. నరేంద్రకుమార్‌, ఐద్వా కార్యదర్శి ఎస్‌.రంగమ్మ నాయకత్వంలో సిఐటియు, ఐద్వా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.