Nov 25,2021 22:18

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
దేశ నావికాదళశక్తిని మరింత పెంచేందుకు మరో ఆధునిక జలాంతర్గామి అందుబాటులోకి వచ్చింది. గురువారం ముంబయి డాక్‌యార్డులో ఐఎన్‌ఎస్‌ 'వేలా'ను నేవీ చీఫ్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ చేతుల మీదుగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్‌ఎస్‌ వేలా విధ్వంసకర జలాంతర్గామిగా సేవలందించనుంది. ప్రాజెక్టుా75 పేరుతో నిర్మిస్తున్న కల్వరీ శ్రేణికి చెందిన ఆరు జలాంతర్గాముల్లో ఇది నాల్గోది. 2019 జులైలో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. మజగాన్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ ముంబయి (ఎండిఎల్‌) దీనిని రూపొందించింది. ఈ సబ్‌మెరైన్‌లో 8 మంది అధికారులు, 35 మంది సిబ్బంది ఉంటారు. ఇది డీజిల్‌, ఎలక్ట్రిక్‌ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇందులోని సి303, టార్పిడో కౌంటర్‌మెజర్‌ సిస్టమ్‌ వంటి పరికరాలు ఉన్నాయి. సముద్ర గర్భంలో అత్యంత రహస్యంగా శత్రువులను గుర్తించి లక్ష్యాలను చేధించగలదు. దీనికి కెప్టెన్‌గా అనిష్‌ మాథ్యూ వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో వెస్టెర్న్‌ నేవల్‌ కమాండ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌ రికుమార్‌, మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ వైస్‌ అడ్మిరల్‌ నారాయణ్‌ ప్రసాద్‌ (రిటైర్డ్‌), సీనియర్‌ మిలటరీ, నావికాదళ అధికారులు పాల్గొన్నారు.