Dec 03,2021 15:31

వాషింగ్టన్‌ : అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఉన్నత స్థాయి చీఫ్‌ ఎకనామిస్ట్‌, భారత సంతతి మహిళ గీతా గోపినాథ్‌ వచ్చే నెలలో ఉన్నత పదవిని అధిరోహించనున్నారు. ఐఎంఎఫ్‌లో రెండవ అత్యంత కీలక పదవైన డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సంస్థ గురువారం వెల్లడించింది. తొలి డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జియోఫ్రీ ఒకామోటో స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐఎంఎఫ్‌ చీఫ్‌గా క్రిస్టాలినా జార్జివా వ్యవహరిస్తున్నారు. దీంతో ఐఎంఎఫ్‌లో తొలిసారిగా ఇద్దరు నారీమణులు ఐఎంఎఫ్‌ ఉన్నత స్థాయి పదవుల్లో కొనసాగనున్నారు. నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించడానికి సరైన సమయంలో సరైన వ్యక్తిని నియమించామని జార్జివా తెలిపారు. ముఖ్యంగా మహమ్మారి కారణంగా సభ్యదేశాలు ఎదుర్కొంటున్న స్థూల ఆర్థిక సవాళ్ల స్థాయి, పరిధి పెరుగుతున్న సమయంలో ప్రముఖ స్థూల ఆర్థికవేత్తల్లో ఒకరిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గీత.. తన నైపుణ్యాలతో వీటిని అధిగమిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గీతా ప్రస్తుత బాధ్యతలను 2018 నుండి నిర్వహిస్తున్నారు. ఆమె భారత్‌లో జన్మించినప్పటికీ.. యుఎస్‌ పౌరురాలు కూడా.