Jun 13,2021 07:18

ముఖం చెట్టు
మీసాల చివుళ్ళు తొడగ్గానే
ఖాళీ అయిపోయిన
తల్లిరొమ్ము
చెమట రెక్కలు కట్టుకోమంటుంది.
కలలు పూయని కళ్ళు
గంధకపు మంటలు పూస్తాయి
శరీరాల్లో రక్తానికి బదులు
శిథిల స్వప్నాలు ప్రవహిస్తాయి.
కాకి గూట్లో
భవిష్యత్తును పెట్టి
వలసదారుల్లో ఎక్కడెక్కడికో
ఎగిరి పోయిన
కోయిలలన్నీ
మూడు నెలల సెలవు మీద
ఊళ్ళో కొచ్చి వాలతాయి.
సంవత్సరం పొడుగునా పోగేసిన
జీడిరైతు కష్టమంతా
మొదట
ఎనభై ఎనభై కేజీల బస్తాలవుతుంది
ఆ తరువాత
దళారుల ఖాతాల్లో కరెన్సీ నిల్వవుతుంది
ఆఖరికి -
వాగ్దానాల చితిమంటల వెలుగుల్లో
ఉద్దానం చీకటి ముఖమై మెరుస్తుంది!
తమ మెడలకు తామే ఉరితాళ్ళు
బిగించుకున్న గొంతుల్లో
ఏ నినాదమూ ధ్వనించదు
తెగ్గోసుకున్న చేతి వేళ్ళు
ఎప్పటికీ పిడికిళ్ళు కాలేవు
ఏ ఎండకా గొడుగుపట్టే చేతుల్లో
వర్తమానం జీవచ్ఛమై ఊరేగుతుంది
రాబందూ రాబందూ
కూడబలుక్కొని
వల్లకాడును పంచుకున్నాక
మద్దతు ధర
మళ్లీ మళ్లీ వల్లించబడే ఐదో ఎక్కం!
 

- సాంబమూర్తి లండ,
సెల్‌: 96427 32008