Mar 02,2021 22:58

రైతులతో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి-గొలుగొండ
గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో జాతీయ ఆహార భద్రతా పథకానికి సంబంధించి వ్యవసాయశాఖ ఆధ్వర్యాన గుంటూరు నుంచి వచ్చిన టీమ్‌ సభ్యులు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడిఎ మోహనరావు మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, ఇతర సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. మండల వ్యవసాయాధికారి మధుసూధనరావు మాట్లాడుతూ, గ్రూపు సభ్యులకు తార్పలిన్‌, ఆయిల్‌ ఇంజిన్లు, స్ప్రేయర్లు 50 శాతం సబ్సిడీపై ఇస్తున్నట్లు చెప్పారు. గుంటూరు నుంచి వచ్చిన డిడిఎ సుధాకర్‌రాజు మాట్లాడుతూ వ్యవసాయ కూలీని దృష్టిలో ఉంచుకొని వరి వ్యవసాయంలో వెదజల్లే పద్ధతి, డ్రమ్‌ సీడర్‌, గొర్రు వెనకాల నాటే పద్దతితో అధిక దిగుబడి సాధించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తమల్లంపేట సర్పంచ్‌ రాజబాబు ఆత్మ బిటిఎం లక్ష్మీకిశోర్‌ పాల్గొన్నారు.