Oct 28,2021 18:03

న్యూఢిల్లీ : అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. నిర్ధేశిత సమయంలో 5వేల కి.మీ లక్యాన్ని చేరుకున్నట్లు భారత వ్యూహాత్మక దళాల కమాండ్‌ (ఎస్‌ఎఫ్‌సి) ప్రకటించింది. ఒడిశాలోని ఎపిజె అబ్దుల్‌కలామ్‌ ద్వీపం నుండి బుధవారం రాత్రి ఈ క్షిపణిని ప్రయోగించారు. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ)కి చెందిన టెలిమెట్రీ, రాడార్‌ షిప్‌ల ద్వారా పరీక్షించింది. ఈ క్షిపణి నిర్దేశించిన పరిధిలో ప్రయాణించి 15 నుండి 18 నిమిషాల్లో లక్ష్యాన్ని చేధించింది. బాలిస్టిక్‌ క్షిపణి ఎనిమిదవ విజయవంతమైన ట్రయల్‌ అని ఎస్‌ఎఫ్‌సి పేర్కొంది. 2018 అనంతరం భారత్‌ మొదటిసారి అగ్ని-5 క్షిపణిని ఎస్‌ఎఫ్‌సి పరీక్షించింది. కాగా, అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం కేవలం స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌కే ఉంటుంది. దీనిని 2003లో ప్రారంభించారు. ఈ కమాండ్‌లో త్రివిధ దళాలు సభ్యులుగా ఉంటాయి. అణ్వాయుధాలు ప్రయోగించే పరికరాలు మొత్తం ఈ కమాండ్‌ అధీనంలోనే ఉంటాయి.

ఈ పరీక్ష విజయవంతం కావడంతో చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల సరసన భారత్‌ చేరింది. ఈ క్షిపణి దాదాపు 1500 కిలోల బరువున్న అణువార్‌ హెడ్‌ను శత్రువుపై ప్రయోగించగలదు. దీనిని కెనస్టర్‌ (గొట్టం వంటి పరికరం) నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీనివల్ల క్షిపణిని రైలు, రోడు మార్గాల్లో సురక్షితంగా తరలించి ప్రయోగించే అవకాశం లభిస్తుంది. ఇక వార్‌ హెడ్‌ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో శబ్ద వేగం కంటే కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో వార్‌ హెడ్‌ దెబ్బ తినకుండా దేశీయంగా తయారు చేసిన హీట్‌ షీల్డ్‌ను అమర్చారు. ఇది లోపల వైపు వేడిని 50డిగ్రీల సెల్సియస్‌ లోపే ఉండేట్లు చూస్తుంది.