Oct 03,2021 12:31

సమాజంలో జరిగే అనేక విషయాలపై స్పందించే నటీనటులు అరుదుగా ఉంటారు. అందులోనూ మన తెలుగువారిని వేళ్లపై లెక్కించవచ్చు. అలాంటి వారిలో ఈ మధ్య కాలంలో మంచు మనోజ్‌ ముందు వరుసలో ఉన్నాడు. ఆయన ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తాన్ని అందించడమే కాదు. న్యాయం వైపు నిలబడి గొంతెత్తుతున్నాడు. అవసరమైనప్పుడు ప్రభుత్వాలనూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచార ఘటనపై ఆయన స్పందించారు.

పేరు : మనోజ్‌కుమార్‌ మంచు
పుట్టిన తేదీ : మే 20, 1983
పుట్టిన ప్రాంతం : మద్రాస్‌, తమిళనాడు
నివాస ప్రాంతం : హైదరాబాద్‌
చదువు : బ్యాచిలర్‌ డిగ్రీ
ఇష్టమైన ఆహారం : హైదరాబాద్‌ బిర్యానీ
ఇష్టమైన నటులు : ఎన్‌టిఆర్‌, సౌందర్య
తల్లిదండ్రులు : మోహన్‌బాబు మంచు, నిర్మలా దేవి మంచు
తోబుట్టువులు : లక్ష్మి మంచు,
విష్ణు మంచు


    టీవల సైదాబాద్‌లోని సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ ఘటన సినీ, రాజకీయ ప్రముఖులను కదిలించింది. ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. 'దేశవ్యాప్తంగా స్త్రీలపై, పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేయాలని' హీరో మంచు మనోజ్‌ పిలుపు నిచ్చాడు. రాజకీయ పార్టీలకు అతీతంగా మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ ఆయన ఈ మధ్య ఒక ట్వీట్‌ చేశాడు.
      ఇలాంటి ఘటనలను ఉద్దేశిస్తూ మనోజ్‌ మరో ట్వీట్‌ చేశాడు. ఇందులో 'ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు.. దేశ సమస్య. దేశంలో ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం జరిగినా అది జాతికే అవమానం. భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు జరగకుండా అందరం ఒక్కటిగా కలిసి పోరాడదాం. రాజకీయ పార్టీలకు, అజెండాలు, రాష్ట్రాలు, భాషలకు అతీతంగా మహిళల భద్రత కోసం పాటుపడదాం. మీకు నచ్చిన రాజకీయ పార్టీ కోసం కాకుండా మహిళలు, చిన్నారుల రక్షణ గురించి ఆలోచించండి. మన ఇంటి ఆడబిడ్డలకు మెరుగైన సమాజాన్ని సిద్ధం చేద్దాం. ఒక్కరి కోసం అందరూ.. అందరి కోసం ఒక్కరూ.. కలిసి ఉంటేనే నిలబడగలం' అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
     సాయిధరమ్‌ తేజ్‌ గురించే టీవీల్లో చూపకుండా చిన్నారి కుటుంబానికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందంటూ టీవీ చానళ్ల ప్రతినిధులకు ఆయన హితవు పలికారు.
 

కరోనా కష్టకాలంలోనూ...
కరోనా కష్టకాలంలో తన స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహంతో పాతిక వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆయనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ హైదరాబాద్‌లో నివసించే వలస కార్మికులెందరికో సొంతూర్లకు వెళ్లడానికి ఆర్థికసాయం చేశాడు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోవిడ్‌ సమయంలో వారి జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి సేవలు చేశారని అనేక సందర్భాలలో కొనియాడారాయన.
ఈ మధ్య కాలంలో బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాబుకు అండగా నిలిచాడు మనోజ్‌. మనోహర్‌ అనే ఆటోడ్రైవర్‌ తన
బిడ్డ బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, బాబుకు చికిత్స చేయించడానికి తన దగ్గర డబ్బులు లేవని సాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంటూ సోనూసూద్‌ను ట్వీట్‌ ద్వారా అభ్యర్థించాడు. ఈ ట్వీట్‌ చూసి చలించిన మనోజ్‌ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చాడు. 'దయచేసి నా ఇన్‌బాక్స్‌కి అన్ని వివరాలూ పంపండి. ఆసుపత్రి పేరు, వైద్యుల పేర్లనూ పంపండి. ధైర్యంగా ఉండండి. ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని రీట్వీట్‌ చేశాడు. దీంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. నీవు మరో సోనూసూద్‌ అంటూ కొనియాడారు.
 

పెద్ద అన్యాయం
స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంపైనా మనోజ్‌ స్పదించాడు. 'విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం చాలా పెద్ద అన్యాయం. నేను హైదరాబాద్‌లో ఉన్నా ఈ విషయంలో చాలా బాధపడుతున్నా. స్టీల్‌ప్లాంట్‌ను కొనడానికి ప్రైవేట్‌ సంస్థలు ముందుకొస్తున్నప్పుడు.. ప్రభుత్వం దానిని ఎందుకు లాభాల్లో నడిపించలేకపోతోంది? ఈ విషయంలో ప్రభుత్వం తన విధానాలను ఎందుకు మార్చుకోకూడదు? అంటూ మనోజ్‌ ప్రశ్నిస్తున్నాడు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరి మద్దతూ ఉంటుందని ఆయన చెప్పాడు. ఈ ఉద్యమానికి మనోజ్‌తోపాటు ఆయన సోదరుడు విష్ణు స్పందించడం విశేషం.