May 18,2021 22:47

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కరోనాకు చిక్కి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఒక్క రోజులో 4,329 మంది దేశ వ్యాప్తంగా మరణించారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తరువాత ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 18,69,223 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,63,533 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2.50 కోట్లు దాటింది. మొత్తం మరణాల సంఖ్య 2,78,719కి చేరింది.
మహారాష్ట్రలోనే వెయ్యి మరణాలు :
మహారాష్ట్రలో ఒక్కరోజులో వెయ్యిమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అక్కడ 26,616 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం కర్ణాటక (38,603), తమిళనాడు(33,075)లో వైరస్‌ ఉధృతి తీవ్రంగా ఉంది. కర్ణాటకలో 476 మంది మరణించగా, తమిళనాడు, ఢిల్లీలో 300 మందికి పైగా మరణించారు.
ఐఎంఎ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కెకె అగర్వాల్‌ మృతి :
ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.కె.అగర్వాల్‌ (62) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో కరోనాకు చికిత్స పొందుతూ, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన 2005లో డాక్టర్‌ బిసి రారు అవార్డు, 2010లో పద్మ శ్రీ అవార్డును అందుకున్నారు.