
ఇచ్ఛాపురం : ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు తప్పని సరని, కార్డుల్లో తప్పులు సరిచేసుకునేందుకు నమోదు కేంద్రం లేకపోవడం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు అన్నారు. ఇచ్ఛాపురంలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సోమవారం డిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో కేవలం సోంపేట మండలం కేంద్రంలో మాత్రమే ఉందని, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేందుకు వ్యయప్రయాసలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు వైపు ఉన్న ఒడిశా రాష్ట్రంలోని సమీప గ్రామాలకు వెళ్లి ఆధార్ కార్డులోని చేర్పులు, మార్పులు చేసేందుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో తిప్పన దుర్యోధనరెడ్డి, భాస్కర్, మణి, అఖిరసాయి, సంతోష్ భవాని, హేమంత్ పాల్గొన్నారు.