Nov 25,2020 20:32

ఏ సమస్య వచ్చినా ఆ అడవి బిడ్డలంతా ఒక్కటవుతారు. ఒక్కమాటపై నిలుస్తారు. ఒక్కబాటలో ఉద్యమిస్తారు. తమని, తామున్న అడవిని కాపాడుకునేందుకు కోందు మహిళలు సాగిస్తున్న స్ఫూర్తిదాయక పోరాట గాథ ఇది.

       ఒడిశాలోని నియామ్‌గిరి కొండ ప్రాంతంలో డోంగ్రియా కోందులు నివసిస్తున్నారు. వీరు ప్రకృతితో సామరస్యంతో మెలుగుతారు. అడవితోనే వారి జీవితం, జీవన శైలి ముడిపడి ఉంటాయి. కోందు మహిళలు ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి కలిగిన వారు. వారు మాట్లాడే భాష 'కోయి'. ఈ భాషకు లిపి లేదు. ఆ అడవిలో మరో 62 రకాల గిరిజన తెగలు జీవిస్తున్నాయి. వ్యవసాయం చేసినా, జీవిత భాగస్వామిని ఎంచుకోవాలన్నా ఆ తెగలోని మహిళలు స్వేచ్ఛను కలిగి ఉంటారు.
       కోందులు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మొక్కజొన్న, రాగులు, సజ్జలు, బెర్రీలు, రకరకాల పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పుట్టగొడుగులు, దుంపలు వంటి 275 రకాల పంటలను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తారు. అయితే, ఆధునికత పేరుతో అక్కడ ప్రభుత్వం వారిని మోనో కల్చర్‌ ఫార్మింగ్‌ పద్ధతిని (ఒకే పంటను పండించడం) అవలంబించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అవసరమైన ముడిసరుకుని తీసుకెళ్లాలని సూచించింది. ఈ పద్ధతి వల్ల గిరిజనుల సాంప్రదాయ వ్యవసాయం దెబ్బతింటుంది. క్రిమిసంహారకాల్ని వాడితే అది అడవిలో ఉండే జీవజాతులకు నష్టం కలిగిస్తుంది. దీంతో, ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా, అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఐదు రోజుల పాటు ఐటిడిఎ ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అధికారుల్ని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
       ప్రభుత్వాలు ఇలా ఏక పంట కోసం ఒత్తిడి చేయటం ఇది మొదటిసారి కాదు. తరచూ ఏదొక రూపంలో తమ సాంప్రదాయ పంటల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవటం తగదని మహిళలు తీవ్రంగా నిరసిస్తున్నారు. 800లకుపైగా గూడేల్లోని మహిళలు ఏకమై, రాయగడ చుట్టుపక్కల నివాసం ఉండే రెండు వేల మంది గిరిజన గూడేలను కలుపుకుని పెద్దఎత్తున ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం వారిపై రకరకాల కేసులు బనాయించింది. తమ భర్తలపై అక్రమ కేసులు మోపి, అరెస్టులు చేయించింది. బెదిరించింది. అయినా మహిళలు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. కలిసికట్టుగా పోరాటం సాగిస్తున్నారు. పచ్చటి అడవిని కాపాడుకునే విషయంలో వెనక్కితగ్గేది లేదని గట్టిగా పోరాడుతున్నారు.
                                                     వైవిధ్య పంటలే వారి జీవనాధారం
       ఈ ప్రాంత గిరిజన మహిళలు పండించే వివిధ రకాల పంటలే వారికి జీవనాధారంగా ఉన్నాయి. సేంద్రియ పంటలను వారం వారం సంతల్లో అమ్ముతారు. వ్యవసాయమే కాకుండా బుట్టలు అల్లడం, కుట్టు, అల్లికలు, పూసల దండల తయారీ వంటివి చేస్తారు. పంట వచ్చిన ప్రతిసారీ సాంప్రదాయ నృత్యాలతో ఆడిపాడి వేడుక జరుపుకుంటారు. ఏ ఒక్కరికి కష్టమొచ్చినా అంతా అండగా నిలుస్తారు. ఆడపిల్లల స్వేచ్ఛకు, నిర్ణయానికి ప్రాధాన్యం ఇస్తారు. వీరి జీవన విధానం 'లివింగ్‌ ఫార్మ్‌ ్స' అనే డాక్యుమెంటరీ కూడా ఉంది. నిరక్షరాస్యతను, పేదరికాన్ని పోగొట్టుకునేందుకు ప్రతి ఇంటి నుంచి పిల్లల్ని చదివించాలని ఈ మహిళలు నిర్ణయం తీసుకున్నారు. తమకు ఆరోగ్యం, విద్య, గృహ వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.