Nov 25,2020 06:34

యువతకు, మహిళలకు ఎక్కడా ఉద్యోగాలు దొరికే స్థితి లేదు. కరోనా కాలంలో నిరుద్యోగం కొన్ని రెట్లు పెరిగింది. వారిలో అత్యధికులు మహిళలేనని వేరే చెప్పాలా? పచ్చి నియంతృత్వం రాజ్యమేలుతోంది. హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. స్త్రీల గౌరవ మర్యాదలకు, మాన ప్రాణాలకు రక్షణ లేదు. హత్రాస్‌ ఘటన మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. అందుకే సోదరీమణులారా...ఒంటిరిగా ఉండి సాధించేదేమీ లేదు. సమ్మె చేద్దాం.


అవన్నీ మగవాళ్ళ యవ్వారాలు. ఆడవాళ్ళకు సమ్మెలెందుకు? ఇల్లు దిద్దుకునే ఆడదానికి...మొగుడికి పిల్లలకి వండి పెట్టుకుని గుట్టుగా సంసారం చేసుకోనే ఆడదానికి...సమ్మెలు, పోరాటాలు, వీధుల్లో ఊరేగడాలు అవసరమా? అని ముఖం చిట్లించే సోదర సోదరీమణులు ఇంకా ఉన్నారు. ఈ సమ్మె పోరాటాలు ఏ ఒక్కరి జీతభత్యాల పెంపుకోసమో కాదు కదా? అందరి కోసం కదా? ఏవేవో డిమాండ్లు. చాలా చెబుతున్నారు. కార్మిక చట్టాలు, వ్యవసాయ చట్టాలు వగైరా. మనకెందుకు. మగవారు చూసుకుంటారులే అనుకుంటున్న సోదరమణుల సంఖ్య తక్కువేమీ కాదు. కానీ ఎక్కడేం జరిగినా మన కొంపకే చుట్టుకుంటుంది. అందుకే ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి. తెలుసుకుని ముడుచుకుని కూర్చోకుండా సంగతేంటో తేల్చుకోవాలి.


ప్రభుత్వం బరితెగించి ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుంటే...కరోనా రోగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను కదలనివ్వకుండా మెదలనివ్వకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుంటే...జనం కళ్లు గప్పి, జనం సొమ్ము దోచుకుని కార్పొరేట్లకు కట్టబెడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? కార్మిక సంఘాలు నడుం కట్టాయి. నవంబర్‌ 26న దేశవ్యాపిత సమ్మెకు పిలుపునిచ్చాయి. అన్ని సంఘాలు కలిసి నిలబడ్డాయి. బరితెగించిన ప్రభుత్వ చర్యలకు అడ్డు కట్ట వేయాలని సంకల్పించాయి. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు తోడుగా నిలిచాయి. గ్రామీణ బంద్‌కు పిలుపునిచ్చాయి.
మరి స్త్రీల సంగతేంటి? వరుసగా మూడు కారణాలు చెప్పుకుందాం. వారం రోజుల కిందట ఒక గ్రామం వెళ్ళాను. ఉపాధి పనులు, డ్వాక్రా గ్రూపులు పరిశీలిద్దామని. అయితే గ్రామంలో ఆడవాళ్ళు అందుబాటులో లేరు. ఏమనంటే ప్రత్తి చేలల్లో ప్రత్తి ఏరడానికి పోయారు. రాత్రి పూట మాత్రమే దొరుకుతున్నారు. డ్వాక్రా సమస్యలు ఏకరువు పెట్టారు. రాజశేఖరరెడ్డి గారి హయాంలో అభయహస్తం పేరుతో ప్రతి ఆడ మనిషి నుండి రూ.3200 పైగా వసూలు చేసిన డబ్బు బ్యాంకుల్లో మూలుగుతోంది. పెన్షన్లు రాలేదు. డబ్బు తిరిగి ఇచ్చింది లేదు. తీసుకున్న రుణాలకు వడ్డీ నెలకు రూ.1 నుండి రూ.1.50 వరకు పడుతుందని ఆవేదన పడుతున్నారు. పావలా వడ్డీ ఊసే లేదు. తీసుకున్న అప్పులు వ్యవసాయానికి పెడుతున్నారు. ఏ కొద్ది మందో గేదెలు కొని పాడి చేస్తున్నారు. మరి మహిళల సాధికారత మాటేమిటి? డ్వాక్రా పేరుతో ఆడవాళ్ళ చేత పొదుపులు చేయించి బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించి వ్యవసాయ ఖర్చులు, కుటుంబ ఆర్థిక భారాలు స్త్రీల నెత్తిన వేయడం కదా? ఆర్థిక మంత్రి 'నిర్మలక్కయ్య' చాలా ప్యాకేజీలు ప్రకటించారు. లక్షల కోట్ల ప్యాకేజీలు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా మహిళలకు అందలేదు. పైపెచ్చు వేలు, లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టినవారు ఉన్నారు. వాళ్ళను ఏ జైలుకు పంపారు? ఇక్కడ ఇంకో మోసం ఉన్నది. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న డబ్బు వందల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మూలుగుతున్నది. ఆ డబ్బు తిరిగి తీసుకోవడానికి బ్యాంకర్లు అభ్యంతరాలు చెబుతున్నారు. మహిళలు దాచుకున్న పొదుపు సొమ్ముపై ఆరున్నర శాతం వడ్డీ. మహిళలు తీసుకున్న రుణాలపై 12 శాతానికి పైగా వడ్డీ. సకాలంలో కట్టలేకపోతే వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తారు. గ్రామీణ కుటుంబాలు తమ పొదుపు మొత్తాలకు ఎక్కడా గ్యారెంటీ లేక బ్యాంకుల్లో డిపాజిట్లు వేస్తున్నాయి. ఆ డిపాజిట్లే బడా పారిశ్రామికవేత్తలకు రుణాలుగా ఇస్తున్నారు. రుణాలు ఎగవేసే బడా బాబుల సంఖ్య పెరిగితే... మన డిపాజిట్లు గల్లంతైతే ఏమిటి పరిస్థితి?


ఇకపోతే ఉపాధి కార్మికులు. వామపక్షాల ఒత్తిడితో కేంద్రం గతంలో ఉపాధి హామీ పథకం తెచ్చింది. ఇది పేరుకు పేద ప్రజల ఉద్ధరణ పథకం. ఆచరణలో పేద మహిళల శ్రమ దోపిడీ పథకంలా మారింది. ఇటీవల ఒక గ్రామంలో సర్వే చేస్తే తేలిందేమంటే ఒక్కో కుటుంబానికి 40 రోజులకు మించి పని ఇవ్వలేదు. రోజుకు ఒక్కొక్కరికి రూ.60-70 నుండి 230 మించి వేతనం అందలేదు. రోజుకు రూ.60 ఇచ్చే ప్రభుత్వ పథకం ఈ దేశంలోనే ఉన్నది. ప్రపంచంలో మరే దేశంలోనైనా ఉన్నదా? ఈ పథకం కింద పని చేసే వాళ్ళల్లో ఆడవాళ్ళు 58 శాతం. వాస్తవానికి మూడవ వంతు పని స్త్రీలకు ఇవ్వాలి. కానీ సగానికి పైగా స్త్రీలు పని చేస్తున్నారు. అంటే మగవాళ్ళు ఆసక్తి చూపడంలేదన్నమాట. ఇది చాకిరి స్త్రీల పరమౌతున్న వైనం (ఫెమినైజేషన్‌ ఆఫ్‌ లేబర్‌). వీరు చేసిన పని రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో కంప చెట్లు పీకడం. పిచ్చి మొక్కలేగా, ఏముందిలే పీకిపారేయొచ్చు అనుకుంటున్నారేమో. గునపాలతో చెట్ల మొదళ్ళు తవ్వి, గొడ్డళ్ళతో నరికిపారెయ్యాలి. ఇక్కడ మరో కుట్ర దాగున్నది. ఒక్కో మనిషికి రోజుకు రూ.60 నుండి రూ.230 వచ్చాయనుకున్నాం కదా. ఈ వేతనం రోజు వేతనం కాదు, గుండుగుత్తగా వేతనం నిర్ణయిస్తారు. లేదా కాంట్రాక్ట్‌ అనుకోవచ్చు. ఇది ఎలా నిర్ణయిస్తారంటే...రోజుకు 8 గంటలు పని దినంగా నిర్ణయించి...పొలం విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని పని దినాలు అవసరమో లెక్కగట్టి... ప్రభుత్వం డబ్బు శాంక్షన్‌ చేస్తుంది. ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వేతనాలు నిర్ణయించేటప్పుడు దుక్కి దున్నడాన్ని ఐదు గంటల పని దినంగా నిర్ణయిస్తుంది. మరి 58 శాతానికి పైగా మహిళలు పని చేస్తున్న ఉపాధి హామీ పథకం కింద ఎండా కాలంలో కఠిన శ్రమకు 8 గంటల పని దినంగా నిర్ణయించడం న్యాయమా? ఇదేనా పేద మహిళల ఉద్ధరణ?


ఇకపోతే వ్యవసాయ చట్టాలు. అదేదో రైతుల సమస్య కదా అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ వ్యవసాయంలో నూటికి 70-80 భాగం పనులు స్త్రీలు చేస్తున్నారు. వ్యవసాయంలో వచ్చే నష్టాల భారాలు స్త్రీలపై పడుతున్నాయి. డ్వాక్రా రుణాలు కూడా వ్యవసాయానికే పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాలు అమలయ్యి, కనీస మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర రాక...స్వదేశీ, విదేశీ, బడా వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఆ భారాలు పడేది స్త్రీల మీద కాదా? పైపెచ్చు ఇది రైతుల సమస్య మాత్రమే కాదు. ధాన్యం, పప్పులు, నూనె గింజలు తదితర ఆహార ధాన్యాల ధరల నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో నుంచి ఎగిరిపోయి బడా వ్యాపారుల చేతుల్లో పడడం ఖాయం. ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టానికి మార్పులు తెచ్చి తూట్లు పెడుతుంది. అంటే బడా బాబుల లాభాలకు మితం ఉండదు. ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఈ దేశ ప్రజలను కార్పొరేట్లు ఆవకాయ బద్ద లాగా నంజుకు తినడానికి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలకు మార్పులు తెచ్చింది. ఇప్పుడు చెప్పండి సమ్మె చేద్దామా? ఇంట్లో కూర్చుందామా?


ఇక కార్మిక చట్టాలు. ప్రతి రోజూ పత్రికల్లో వివరాలు వస్తూనే ఉన్నాయి. పుండు మీద కారం చల్లినట్లు కార్మిక చట్టాలకు కూడా చెల్లు చీటి ఇచ్చి పరిశ్రమాధిపతుల లాభాపేక్షకు, కార్మికుల శ్రమ దోపిడీకి లైసెన్సులు ఇస్తున్నారు. కనీస వేతనానికి దిక్కులేదు. 8 గంటల పని దినం ఎగిరిపోతుంది. ఉద్యోగంలో పర్మినెంట్‌ అన్న పదం ఊడిపోతుంది. 'వాడుకో పారేరు'. ఇది పారిశ్రామికవేత్తల నినాదం. సంపద సృష్టించే కార్మిక వర్గానికి గాని, తిండిగింజలు పండించే రైతాంగానికి గాని భూమి మీద నూకలు వుంచేట్లు లేవు ఈ ప్రభుత్వాలు. ఒంట్లో ఓపిక ఉన్ననాళ్ళు చాకిరి చేస్తాం. తర్వాత చస్తే ఈడ్చే దిక్కు కూడా లేని స్థితి తెచ్చుకుందామా? లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికుల దీర్ఘయాత్రల రక్తపు చారలు మనం ఇంకా మరవలేదు కదా? యువతకు, మహిళలకు ఎక్కడా ఉద్యోగాలు దొరికే స్థితి లేదు. కరోనా కాలంలో నిరుద్యోగం కొన్ని రెట్లు పెరిగింది. వారిలో అత్యధికులు మహిళలేనని వేరే చెప్పాలా? తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న బీడీ, టెక్స్‌టైల్‌, రొయ్యల కంపెనీలు, జీడిపప్పు కంపెనీల్లో పని చేసే కార్మికులకు చాకిరి తప్ప ఫలితం మిగలడం లేదు. పచ్చి నియంతృత్వం రాజ్యమేలుతోంది. హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. స్త్రీల గౌరవ మర్యాదలకు, మాన ప్రాణాలకు రక్షణ లేదు. హత్రాస్‌ ఘటన మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. అందుకే సోదరీమణులారా...ఒంటిరిగా ఉండి సాధించేదేమీ లేదు. సమ్మె చేద్దాం. సమ్మె నినాదాన్ని వాడవాడకు తీసుకెళ్దాం.
                                                             - ఎస్‌. పుణ్యవతి (ఐద్వా జాతీయ కోశాధికారి )