Jan 28,2021 11:34

గుంటూరు (నరసరావుపేట రూరల్‌) : ఇటీవల అదృశ్యమైన మాచర్ల నియోజకవర్గానికి చెందిన బిసి సంఘాల నాయకుడు కంచర్ల నాగరాజును పట్టణ సమీపంలోని పెదతురకపాలెం రోడ్డు గ్రావెల్‌ గుంటలలో దారుణంగా హతమార్చి దహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన నాగరాజు ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు 21వ తేదీన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు, కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాలిపోయిన మృతదేహన్ని పెదతురకపాలెం రోడ్డులో కుటుంబసభ్యులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతుడు నాగరాజుగా కుటుంబసభ్యులు నిర్దారించడంతో ఘటనా స్థలంలోనే శవపంచనామా, పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ.. నాగరాజుకు తురకపాలెంకు చెందిన ముస్లిం యువతితో ప్రేమ వివాహం అయిందని చెప్పారు. 2013లో వివాహం అయిన మూడు నెలలకే ఆ యువతి మృతి చెందిందని, ఆ కేసు 2017 వరకు కొనసాగిందని అన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.