Oct 30,2020 07:13

రాష్ట్రాలు 'అడకత్తెరలో పోక చెక్క'లా నలిగిపోతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) మంగళవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల బడ్జెట్లను విశ్లేషించి ప్రతి ఏటా ఆర్‌బిఐ ప్రచురించే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి (స్టేట్‌ ఫైనాన్సెస్‌)పై నివేదికలు రాష్ట్రాల ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరించడంతోపాటు భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలను సూచిస్తుంది. కరోనాకు ముందు రూపొందిన రాష్ట్రాల బడ్జెట్ల సగటు స్థూల ద్రవ్య లోటు 2.8 శాతం మాత్రమే కాగా మార్చి తరువాత వచ్చిన బడ్జెట్లలో 4.6 శాతం వరకూ వుందని ఆర్‌బిఐ పేర్కొంది. ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ మహమ్మారి విరుచుకుపడడంతో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. జిఎస్‌టి వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 47.2 శాతం పడిపోగా రెండో త్రైమాసికంలో 6.4 శాతం తగ్గింది. ఏర్పడిన జిఎస్‌టి లోటును చట్ట ప్రకారం భర్తీ చేయవలసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అష్టకష్టాలు పెడుతోంది. కరోనా 'దైవ లీల' అంటూ రాష్ట్రాలే అప్పులు చేసుకోవాలని చెప్పిన కేంద్రం 'అలా కుదరద'ంటూ కేరళ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిఘటనకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు పలకడంతో వెనక్కు తగ్గక తప్పలేదు.
              ఆదాయం గణనీయంగా కుదించుకుపోయిన నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులపై 22, ఆల్కహాల్‌పై 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పన్నులు పెంచాయి. లోటు పూడ్చడానికి అది కూడా చాలదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ బహిరంగ మార్కెట్‌ రుణాలు తీసుకోవలసి వస్తోంది. కేంద్రం నుండి వచ్చే పన్నుల వాటా తగ్గిపోవడమేగాక గడచిన ఆరేళ్లలో చిన్న మొత్తాల పొదుపు, ఎల్‌ఐసి, నాబార్డు తదితర సంస్థల నుండి రుణాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పుడు రాష్ట్రాలకు ఆ అవకాశమూ లేకపోవడంతో మార్కెట్‌ రుణాలు ఎక్కువగా తీసుకోవలసి వస్తోంది. 2016-17లో రూ. 3.52 లక్షల కోట్లు (బడ్జెట్‌లో 2.3 శాతం) ఉన్న ఈ రుణాలు 2020-21లో రూ.5.61 లక్షల కోట్లకు (బడ్జెట్‌లో 2.5 శాతానికి) పెరిగాయి. అందులో రూ.3.86 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతోందంటే రాష్ట్రాలు అప్పుల ఊబిలో ఎంత లోతున కూరుకుపోయాయో విదితమవుతోంది. రాష్ట్రాల ఆదాయం తగ్గిపోవడంతో అవి చేసే అభివృద్ధి వ్యయంపై కోత పడుతుంది. అందునా క్యాపిటల్‌ వ్యయం తగ్గితే దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయి. ప్రజలకు వైద్యం, విద్య తదితర సంక్షేమ చర్యలు చేపట్టడానికి వ్యయం పెంచాల్సిన ఈ క్లిష్ట సమయంలో అది కూడా రాష్ట్రాలకు కష్టతరమవుతుంది.
             సహకార ఫెడరలిజం పెంపొందింపజేస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో హామీనిచ్చిన బిజెపి గద్దెనెక్కిన ఈ ఆరేళ్లలో రాష్ట్రాల అణచివేత తప్ప వాటికి ఆర్థిక పరిపుష్టి కలిగించలేదు. బిజెపి పాలిత రాష్ట్రాలకు, కమలనాథులతో ప్రత్యక్ష, పరోక్ష నెయ్యం చేసిన వారికే కేటాయింపులు తప్ప మిగతా రాష్ట్రాలకు ప్రకృతి విపత్తుల సమయంలో సైతం అన్యాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జిఎస్‌టి లోటు భర్తీ చేయడంతోపాటు రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించడం అవసరం. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల సాకు చూపి తప్పుకోవడం కేంద్రానికి తగదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితేనే దారికి వస్తుంది కనుక వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమన్వయంతో ఆ దిశగా కృషి చేయాలి. ప్రత్యేక హోదాను నిరాకరించడమేగాక, విభజన హామీలను తిరస్కరించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర హాని చేసింది. పోలవరం నిర్మాణ వ్యయంలో కీలకమైన పునరావాస పునర్నిర్మాణానికయ్యే ఖర్చును భరించబోమని తాజాగా ప్రకటించడం మోసపూరితం. రాష్ట్రానికి ఇది గోరుచుట్టుపై రోకటి పోటు లాంటిది. పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టుకయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేలా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలూ కేంద్రంపై ఒత్తిడి తేవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కృషిలో ముందుండాలి.