Jan 21,2021 21:23

గ్రాట్యుటీ, పిఎఫ్‌ బకాయిలపై నాయకులను చుట్టుముట్టిన జ్యూట్‌ కార్మికులు 

బొబ్బిలి : గ్రాడ్యుటీ బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారంటూ శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్‌ మిల్లు అడహక్‌ కమిటీ నాయకులు పి.కృష్ణ, వి.శేషగిరిరావు, ఎ.సింహాచలంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూట్‌ కార్మికులకు చెల్లించాల్సిన గ్రాడ్యుటీ, పిఎఫ్‌, ఇఎస్‌ఐ బకాయిలు 2019 డిసెంబర్‌ నాటికి చెల్లించేందుకు ఎమ్మెల్యే సమక్షంలో అడహక్‌ కమిటీ ఏర్పడి ఒప్పందం చేసినప్పటికీ నేటికీ చెల్లించకపోవడంతో కార్మికులంతా గురువారం జ్యూట్‌ మిల్లు గేటు వద్దకు చేరుకుని కార్మిక నేతలను నిలదీశారు. బకాయిలు చెల్లించకుండా కార్మికులకు అన్యాయం చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యానికి మద్దతు ఇవ్వడం వల్లే బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. గేటు నుంచి నాయకులు వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా కార్మికులు చుట్టుముట్టారు. బకాయిలు చెల్లించే వరకు వదిలేది లేదని కార్మికులంతా భీష్మించుకుని ఉన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో సాయంత్రం చర్చలు జరిపేందుకు హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించి ఇళ్లకు వెళ్లారు. జ్యూట్‌ మిల్లు మూతపడడంతో అనేకమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వైద్యం చేసుకునేందుకు డబ్బులు లేక అనారోగ్యంతో మరణించారని, పిల్లలను చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. జీవనోపాధి కోసం వలసలు వెళ్లి ఇబ్బందులు పడుతున్న తమకు న్యాయబద్ధంగా రావాల్సిన గ్రాడ్యుటీ బకాయి ఇప్పించకుండా యాజమాన్యానికి ప్రభుత్వ పెద్దలు సహకరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.
చర్చలు 23కు వాయిదా
జ్యూట్‌ కార్మికుల గ్రాడ్యుటీ బకాయిపై ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో జరిగిన చర్చలు ఈనెల 23కు వాయిదా పడ్డాయి. గ్రాడ్యుటీ, పిఎఫ్‌, ఇఎస్‌ఐ బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికులు అడహాక్‌ కమిటీ నాయకులను నిలదీయడంతో సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరిగాయి. యాజమాన్యంతో మాట్లాడి ఈనెల 23 సాయంత్రం 4గంటలకు పూర్తి వివరాలు చెపుతామని ఎమ్మెల్యే చెప్పడంతో కార్మిక నాయకులు, కార్మికులు అసంతృప్తితో వెనుదిరిగారు.