Apr 14,2021 20:38

న్యూఢిల్లీ: అదానీ గ్రూపులోని కీలక కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌కు కలలో కూడా ఊహించని భారీ షాక్‌ తగిలింది. ఈ కంపెనీని అమెరికా స్టాక్‌ ఎక్స్చేంజీ ఎస్‌అండ్‌పి డౌజోన్స్‌ లిస్టింగ్‌ నుంచి తొలగించాలని అనుహ్యా నిర్ణయం తీసుకుంది. మయన్మార్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చేసిన సైన్యానికి ఆదానీ గ్రూప్‌ సంస్థకు వ్యాపార లావాదేవీలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని డిజోన్స్‌ ప్రకటించింది. గురువారం ట్రేడింగ్‌కు ముందు లిస్టింగ్‌ నుంచి తొలగించే అవకాశముంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసిన మయన్మార్‌ సైన్యం దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. డోజోన్స్‌ నిర్ణయాన్ని మయన్మార్‌ మానవ హక్కుల, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. కాగా దీనిపై అదానీ గ్రూపు స్పందించలేదు.
అదానీ పోర్ట్స్‌ కంపెనీ మయన్మార్‌లోని యంగూన్‌లో ఓ రేవును నిర్మిస్తోంది. దీంతో పాటు మయన్మార్‌ ఎకనామిక్‌ కార్పొరేషన్‌ నుంచి భూమిని లీజుకు తీసుకుంది. సైనిక తిరుగుబాటుకు ముందు రోజుల్లో అదానీ పోర్ట్స్‌ కీలక ఉన్నతాధికారి ఆర్మీ జనరల్‌తో భేటీ కావడం.. తాజాగా డౌజోన్స్‌ నిర్ణయంతో అదానీ పోర్ట్స్‌పై అనుమానాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఆర్మీ చీఫ్‌, సీనియర్‌ జనరల్‌ మిగ్‌ ఆంగ్‌ లాయింగ్‌తో 2019 జులైలో అదానీ పోర్ట్స్‌ సిఇఒ కరన్‌ అదానీ భేటీ అయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి ఒకటిన మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజా ఉద్యమాన్ని సైన్యం అణచివేస్తోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే వందలాది మంది పౌరులు మరణించారు.