Mar 02,2021 21:45

పట్టణంలోని ఓ వీధిలోని రోడ్డులో నిలచిన మురుగునీరు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : కదిరి ఎంతో గుర్తింపు పొందిన ప్రాంతం. ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిమ్మమ్మ మర్రిమాను, ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కటారుపల్లి యోగివేమన ఆలయం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కదిరి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలచింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. తాగునీరు, రోడ్లు, డ్రయినేజీ తదితర సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఇన్ని సమస్యలున్న కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి నూతనంగా ఎన్నికయ్యే పాలకవర్గమైనా దృష్టిసారించేనా అన్న ప్రశ్నలు పట్టణ ప్రజల్లో వెల్లడవుతున్నాయి.

ఎంతోమంది నాయకులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను చేసిన ఘనత కదిరి నియోజకవర్గానికి ఉంది. పాలకులు ఎంత మంది మారిన ప్రజల తలరాతలు మారలేదు పట్టణ అభివద్ధి మాత్రం శూన్యం. ప్రధానంగా హిందూపురం రోడ్డు, ఎంజి రోడ్లు తదితర రహదారులు ఇరుకుదారులే. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరించలేదు. దీంతో చాలాచోట్ల ట్రాఫిక్‌ సమస్య తరచూ తలెత్తుతోంది. పట్టణంలో ప్రధాన వీధులలో రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయి. డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అడపాల వీధి పంచాయతీ రాజ్‌ ఆఫీస్‌, మసీదు, పార్థసారధి కాలనీ, నిజాం వలి కాలనీ, జడలయ్య మఠం, బాబా కాలనీ వంటి ప్రధాన వీధుల్లో నేటికీ మట్టిరోడ్లు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా హిందూపురం ప్రధాన రహదారిలో శంకరయ్య క్లినిక్‌ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో నెలల కొద్ది ప్రజలు ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొన్నారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి ఎన్నికలలో అనేక పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీ నేతత్వంలోని నాయకులు ఛైర్మన్లుగా కొనసాగారు. పట్టణంలో 36 వార్డులు ఉండగా అందులో 22 వార్డుల్లో టిడిపి నేతత్వంలోని నాయకులు గెలిచి తొలిసారిగా 2014 సంవత్సరంలో కదిరి మున్సిపాల్టీలో టిడిపి జెండా ఎగురవేశారు.
మున్సిపోల్స్‌లో ఆ వార్డులే కీలకం
పట్టణ ప్రాంతంలో ఆ 17 వార్డులే మున్సిపాలిటీ ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఆయా వార్డుల్లో నివసించే బీడీ కార్మికులు, రోజువారి కూలీలు, రైతు కూలీలు , భవన నిర్మాణ కార్మికులతో పాటు నిజాం వలి కాలనీ, పార్థసారథి కాలనీ, జడలయ్య మఠం, దేవానంద్‌ కాలనీ, పూల బజార్‌, కుటాగుల్లలో నివసించే ఓటర్లే మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకంగా మారారు.
ఛైర్మన్‌ పీఠంపై గురి
మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకుని ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులో భాగంగా పట్టణ ప్రాంతంలో అధికంగా ఉండే మైనారిటీ ఓట్ల కోసం ప్రధాన పార్టీలు గురిపెట్టాయి
వచ్చే పాలకులైన అభివృద్ధిపై దృష్టి సారించేరా..?
మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించే నూతన పాలకవర్గమైనా పట్టణ అభివృద్ధిపై దృష్టిసారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించి, ఆప్యాయంగా పలుకరించి గెలిచిన అనంతరం ముఖం చాటేయకుండా మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.