Apr 14,2021 13:08

న్యూఢిల్లీ : దేశంలోని పరిమిత వనరులతోనే జనాభాను కరోనా మహమ్మారి నుండి రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని.. అదే సమయంలో 80కు పైగా దేశాలకు వ్యాక్సిన్‌లను అందించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన 'రైసినా డైలాగ్‌' అనే చర్చా కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ప్రపంచ స్థితిగతులను మార్చడానికి కరోనా మహమ్మారి అవకాశం కల్పించిందని అన్నారు. ప్రజలు రక్షించడంలో భారత్‌ కీలకపాత్ర పోషించిందని మోడీ పేర్కొన్నారు. అలాగే నేటి సమస్యలను, రేపటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కరోనా అవకాశం కల్పించిందని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మన అనుభవాలను, నైపుణ్యం, వనరులను ప్రపంచ మానవాళితో పంచుకుంటామని అన్నారు. మన పాస్‌పోర్టు ఫొటోలో మన రంగుతో నిమిత్తం లేకుండా అందరూ కలిసికట్టుగా కృషిచేస్తే తప్ప కరోనాపై విజయం సాధించలేమని అన్నారు. దేశంలో ఉన్న పరిమిత వనరులతోనే మహమ్మారిని అడ్డుకునేందుకు యత్నించామని అన్నారు. భూమిని రక్షించడం గురించి వివరిస్తూ.. సమస్యలను ఎదుర్కొనేందుకు ప్లాన్‌ ఎ, ప్లాన్‌ బి ఉన్నాయి కాని.. మరో గ్రహం లేదని.. ఉన్నదల్లా భూమి ఒక్కటేనని అన్నారు. దీంతో భవిష్యత్‌ తరాలకోసం భూమిని కాపాడాలని అన్నారు. కరోనా మహమ్మారిపై సమర్థంగా పోరాడాలంటే అందరికీ సమానంగా వ్యాక్సిన్‌ అందడం చాలా ముఖ్యమని, ఆ దిశగా 'వ్యాక్సిన్‌ మైత్రి' ద్వారా భారత్‌ కృషి చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ‌ అన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే భారత్‌ వంటి దేశాల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. . ఈ కార్యక్రమంలో రువాండా అధ్యక్షుడు పాల్‌ కగామె, డెన్మార్‌ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్‌లు ప్రసంగించారు.