Dec 03,2021 21:27

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి -ఉక్కునగరం (విశాఖ) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఆరో తేదీన కోటి సంతకాల ఉద్యమాన్ని తలపెట్టామని, ఈ మహోద్యమంలో ప్రతిఒక్కరూ పాల్గనాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 295వ రోజుకు చేరాయి. శుక్రవారం దీక్షల్లో కర్మాగారం ఇఎస్‌ఎఫ్‌, ఇఆర్‌ఎస్‌, సేఫ్టీ విభాగాల ప్రతినిధులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధులు డి.ఆదినారాయణ, గంధం వెంకట్రావు, వైటి దాస్‌ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. వీటిలో పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయి చిన్నపాటి పనులు చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. గడిచిన 70 సంవత్సరాల్లో చేసిన అప్పుల కంటే మోడీ ప్రభుత్వం మూడు రెట్లు అధికంగా అప్పు చేసిందని విమర్శించారు. సంపద, శ్రమదోపిడీతో కార్పొరేట్లు అత్యంత ధనవంతులుగా మారుతున్నారన్నారు. ఈ విధానాలను ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల ప్రతినిధులు గంగాధర్‌, జి సూరిబాబు, ఎమ్‌ఎన్‌.రెడ్డి, జి.శ్రీను, బి.రాము, బంజుబాబు, కన్నారావు, ఎమ్‌.రామకృష్ణ పాల్గొన్నారు.