Dec 05,2021 17:49

లక్నో : ఆధునిక కాలంలో అత్యంత పాశవిక ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా.. హత్య చేశాడో ఓ కర్కోటకుడు. అనంతరం ఓ ట్రంక్‌ పెట్టెలో కుక్కి.. ఓ ఇంట్లో వదిలేశాడు. ఈ ఘటన శుక్రవారం హపూర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం కొనుక్కోవడానికి ఇంటి నుండి బయటకు వచ్చిన చిన్నారిని మాయమాటలు చెప్పి అంజాద్‌ అనే వ్యక్తి..తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేశాడు. నిందితుడు ఓ కూలీ అని, బాలికపై అత్యాచారం చేసే సమయంలో అతడి భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో వెతికిన కుటుంబ సభ్యులు... ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో శనివారం ఓ ఇంటి నుండి దుర్వాసన వస్తుందని ఇతర నివాసితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మెయిన్‌ గేట్‌ లాక్‌ వేసి ఉండటంతో పగుల కొట్టి.. లోపలికి వెళ్లి చూడగా.. ఓ ట్రంక్‌ పెట్టెలో బాలిక శవం కనిపించింది. నిందితుడ్ని పట్టుకుని విచారించగా.. నేరం అంగీకరించాడని, అతడు డ్రగ్స్‌కు బానిసైనట్లు చెప్పారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు.