Dec 05,2021 19:49

ఎన్‌సిఎస్‌ సుగర్‌ ఫ్యాక్టరీ

సీతానగరం: చెరుకు పరిశ్రమలంటే గుర్తుకు వచ్చే బొబ్బిలి, అప్పయ్యపేటలో సుగర్‌ ఫ్యాక్టరీ ఇప్పటికే కనుమరుగు కాగా, నేడు లచ్చయ్యపేట వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. 50ఏళ్ల చరిత్ర గలిగిన ఈ ప్రాంతంలోని చెరుకు కర్మాగారాల్లో క్రషింగ్‌ నిలిపివేసే పరిస్థితులు ఎప్పుడు లేదు. ఎన్‌సిఎస్‌ యాజమాన్యం నిర్ణయం వల్ల నేడు మొదటిసారిగా ఈప్రాంతంలో క్రషింగ్‌ నిలిపివేయడంతో అటు రైతులు, ఇటు ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌సిఎస్‌ సుగర్స్‌ క్రషింగ్‌ నిలిపివేతకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వాణిజ్య పంటైన చెరుకును బొబ్బిలి, సీతానగరం, బలిజిపేట, మక్కువ, బాడంగి, తెర్లాం, సాలూరు, రామభద్రపురం, కొమరాడ తదితర మండలాల్లోని రైతులు గత 45ఏళ్లుగా సాగు చేస్తున్నారు. అప్పట్లో బొబ్బిలి రాజులు బొబ్బిలి, అప్పయ్యపేటలో చెరుకు కర్మాగారాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల వేలాదిమంది రైతులు, వందలాది మంది కార్మికులు ఈ రెండు కర్మాగారాల ద్వారా జీవనోపాధి సాగించేవారు. చెరకు సాగుతో పాటు మంచిరికవరీ, అధిక దిగుబడి వచ్చే చెరుకు ఈ ప్రాంతంలో ఉండడంతో రైతులు కూడా ఆనందంగా జీవితాన్ని గడిపేవారు. ఈ రెండు కర్మాగారాల్లో తక్కువ క్రషింగు సామర్థ్యం ఉండడాన్ని గుర్తించిన ప్రభుత్వం విలీనం చేసి లచ్చయ్యపేటలో దాదాపు 300 ఎకరాలు భూసేకరణ చేసి 1995-96సీజన్లో నిజాంషుగర్స్‌ పేరిట రోజూ 2500 టన్నుల క్రషింగు సామర్ధ్యంతో ప్రభుత్వ ఆధీనంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ రెండు కర్మాగారాల్లో దాదాపు 1350 మంది పైబడి కార్మికులు పనిచేసేవారు. నిజాంషుగర్స్‌ కర్మాగారంలో విలీనమయ్యాక చెరుకు సాగు కూడా పెరిగింది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే సమయంలో కొన్ని సమస్యలను, సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకొని 2002-03 క్రషింగు సీజన్లో ఎన్‌సిఎస్‌ యాజమాన్యానికి టిడిపి ప్రభుత్వం రూ. 21కోట్లుకు అమ్మేసింది. 400మంది కార్మికులను యాజమాన్యానికి అప్పగించింది. ఎన్‌సిఎస్‌ యాజమాన్యంలో చెరుకుసాగు పెరగడంతో పాటు క్రషింగ్‌ సామర్ధ్యం రోజువారీ 6500 టన్నులకు పెంచి కర్మాగారాన్ని అభివృద్ధి చేసింది. పదేళ్లపాటు కర్మాగారం పరిధిలోని రైతులకు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని విధాలా యాజమాన్యం వారిని ఆదుకోవడం గమనార్హం. అటువంటి ఈ కర్మాగారం 2015-16 నుంచి తిరోగమనం ప్రారంభమై రైతులు ఆందోళన వైపు ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, విడతల వారీగా చెల్లింపులను ప్రారంభించిన యాజమాన్యం గతయేడాది డిసెంబరు 25నుంచి పూర్తిగా చేతులెత్తేసింది. 2015-16, 2017-18, 2018-19 క్రషింగ్‌ సీజన్‌కు చెరుకు రైతులు, కార్మికుల బకాయిల కోసం 2019 డిసెంబరులో ఆర్‌ఆర్‌ చట్టం ద్వారా కర్మాగారం వెలుపల గల 62.47 ఎకరాల భూమిని రూ.27.49 కోట్లకు అమ్మేసి చెల్లింపులు చేసింది. కర్మాగారానికి పూర్వవైభవం తెస్తామని చెప్పిన యాజమాన్యం మళ్లీ 2018-19, 2019-20 గానుగ సీజన్లో రైతులకు రూ.16.34 కోట్లు, కార్మికులకు రూ.6.5కోట్లు బకాయి పడింది. దీంతో మళ్లీ రెండోసారి ఆర్‌ఆర్‌ యాక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కర్మాగారంలో చరాస్తిగా ఉన్న పంచదారను గతనెల 23న వేలం వేశారు. దీనిద్వారా వచ్చే రూ.11.5కోట్లును పది రోజుల్లో రైతులకు చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ టాటా ఇంటర్నేషనల్‌ సంస్థ వారు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంతో డిసెంబరు నెలాఖరులోగా చెల్లింపులు జరిగే అవకాశాల్లేవని స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటు కర్మాగారం వెలుపల సీతానగరం, బొబ్బిలి మండలాల్లో మిగిలిన భూములు సుమారు 25ఎకరాలపైగా ఇప్పటికే ఫారం-5 నోటీసులను రెవెన్యూ అధికారులు జారీచేశారు. వివిధ దశల్లో జరిగే ఈ ప్రక్రియ 2022 జనవరి నెలాఖరులోగా వేలంపాట జరగనుందని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా పంచదార, భూముల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులు రైతుల బకాయిలు రూ.16.34 కోట్లు చెల్లింపుకే సరిపోతే ఇక కార్మికుల సంగతి ఏమిటన్నది ప్రశ్నార్ధకం.
కొనసాగతున్న రిలేనిరాహారదీక్షలు
లచ్చయ్యపేటలో ఎన్‌సిఎస్‌ కర్మాగారంలో రైతుల, కార్మికుల బకాయిలు తక్షణమే చెల్లింపు చేయడంతో పాటు క్రషింగు వేయాలని డిమాండ్‌ చేస్తూ కర్మాగారం ఎదుట రైతు, కార్మిక సంఘాలు రిలేనిరాహారదీక్షలు చేస్తున్నాయి. పలు పార్టీలు, కార్మికసంఘాలు వీరికి సంఘాభావం తెలుపుతున్నాయి.
సంకిలికి చెరుకును ఎలా తరలించాలి?
జిల్లాలో భీమసింగి, లచ్చయ్యపేట చక్కెర కర్మాగారాల్లో ఈ ఏడాదికి క్రషింగ్‌ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో సాగైన చెరుకును పక్కన గల శ్రీకాకుళం జిల్లా సంకిలి ప్యారీ చక్కెర కర్మాగారానికి తరలించాలని అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అయితే లచ్చయ్యపేట కర్మాగారం పరిధిలో లక్షన్నర టన్నులకు పైగా చెరకు ఉండడంతో రైతులు దీన్ని ఎలా తరలించాలని ప్రశ్నిస్తున్నారు. రైతులు నేరుగా లేదా కొనుగోలు కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఇంతవరకు రైతులకు చెరకును తరలించడానికి సంబంధించి బొబ్బిలిలో ఉన్న చెరుకు సహాయ కమిషనర్‌ (ఎసిసి) ఎటువంటి సమావేశాలు నిర్వహించకపోవడం గమనార్హం. దీంతో దళారులు నేరుగా రంగప్రవేశం చేసి తక్కువధరకు కొనుగోలు చేసి సంకిలికి తరలిస్తున్నారు. రైతుల సందేహాలు ఎవరు తీరుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పష్టమైన సమాచారం అందజేసి, చెరకు తూనిక కేంద్రాలు ఏర్పాటు చేసి చెరకును కొనుగోలు చేయాలని రైతులు, రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో పాటు బకాయిలు కూడా తక్షణమే చెల్లించాలని వారు కోరుతున్నారు. లేకుంటే దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కార్మికులు, రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.