
అబూజ : నైజీరియాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 43 మంది వ్యవసాయ కూలీలు చనిపోయారు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగర సమీపంలో చోటు చేసుకుంది. కోషోబ్లో బోకోహరమ్ తీవ్రవాదులు.. పొలంలో పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి... చేతులు కట్టేసి, గొంతుకోసి దారుణ్యంగా హత్య చేశారు. ఇది అత్యంత భయానక ఘటనగా ఐక్యరాజ్యసమితి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎడ్వర్డ్ కల్లోన్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన రైతులకు నైజీరియా ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. హత్యకు గురైన రైతు కూలీల్లో పదిమంది మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.