Dec 03,2021 21:40

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి :రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేపట్టిన పాదయాత్ర 33వ రోజూ కొనసాగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర శుక్రవారం నెల్లూరులోని తురిమెర్ల నుంచి ప్రారంభమై సైదాపురం వరకు చేరింది. పాదయాత్ర సాగిన ప్రాంతమంతా జై అమరావతి నినాదాలతో హోరెత్తింది. స్థానిక మహిళలు, యువకులు, వివిధ పార్టీల నేతలు అధిక సంఖ్యలో తరలివచ్చి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. రైతుల యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరధం పట్టారు. పూలు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, మాజీ స్పీకర్‌ కోడేల తనయుడు కోడేల శివరాం, బిజెపి జాతీయ నాయకులు సత్యకుమార్‌, నేతలు రావెల కిషోర్‌బాబు, భాను ప్రకాష్‌రెడ్డి పాల్గని రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమం విజయవంతవుతుందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఓ తుగ్లక్‌ చేస్తున్న పరిపాలన అంతమొందుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రరణ అంటే ఊరికో ప్యాలెస్‌ కట్టుకోవడం కాదని విమర్శించారు. అమరావతి జెఎసి నేతలు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాదయాత్రను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.