Sep 24,2021 01:54

మాట్లాడుతున్న అయోధ్యరామ్‌

ప్రజాశక్తి-ఉక్కునగరం
స్టీల్‌ కార్మికులకు 30శాతం పెర్క్స్‌ తో కూడిన సత్వర వేతన ఒప్పందం చేయాలని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం గుర్తింపు యూనియన్‌ ఆధ్వర్యంలో ఉక్కునగరం ఎల్‌ఎంఎంఎం పార్కులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుర్తింపు సంఘం అధ్యక్షులు జె. అయోధ్య రామ్‌ మాట్లాడుతూ స్టీల్‌ కార్మికుల వేతన ఒప్పంద కాలం ముగిసి ఐదేళ్లు దాటుతున్నా ప్రభుత్వ యాజమాన్యాల నిర్లక్ష్యంతో వేతన ఒప్పందం ఆలస్యమౌతోందన్నారు. పెరుగుతున్న ధరకలనుగుణంగా వేతన సవరణ చేయాలన్నారు. కార్మికుల్లో అసహనం పెరగకముందే యాజమాన్యం కార్మిక అమోదయోగ్యమైన నిర్ణయంతీసుకోవాలన్నారు. ఐఎన్‌టియుసి అధ్యక్షులు గంధం వెంకట్రావు మాట్లాడుతూ కార్మికుల ఓర్పును బలహీనతగా భావిస్తే సహించేది లేదన్నారు. యాజమాన్య కుయుక్తులను తిప్పికొడుతూ కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కనుక ఈ ఉద్యమంలో భాగంగా ఈనెల 29న డిమాండ్‌ బ్యాడ్జీ ధరించి విధులకు హాజరు అవుతామని, 30న పూర్తి రోజు ధర్నాను ప్రధాన పరిపాలనా భవనం ఎదుట నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్టీల్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు జె. సింహాచలం, వై మస్తానప్ప, బొడ్డు పైడిరాజు, దొమ్మేటి అప్పారావు, కొమ్మినేని శ్రీనివాస్‌, వరసాల శ్రీనివాస్‌, కష్ణారావు, టీ జగదీష్‌, డేవిడ్‌, ఉగ్రం, కరణం సత్యారావు, మహాలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు.