Nov 13,2020 22:12

న్యూఢిల్లీ : పంజాబ్‌ రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య శుక్రవారం సుమారు ఆరు గంటలకు పైగా జరిగిన చర్చలు అసంపూర్తిగా, అస్పష్టంగా ముగిశాయి. రాష్ట్రానికి గూడ్స్‌ రైళ్ల సేవలను తిరిగి ప్రారంభించడంపై కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈనెల 26, 27 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతామని రైతు సంఘాలు ప్రకటించాయి. పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ నుంచి వేలాది మంది రైతులు ఆందోళనలో భాగంగా ట్రాక్టర్లతో రాజధానికి చేరుకుంటారని తెలిపారు. శనివారం దీపావళి పండుగను రాష్ట్రంలో బ్లాక్‌ డేగా పాటిస్తామని తెలిపాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. రైలురోకో కార్యక్రమాలు నిర్వహించడంతో రాష్ట్రానికి గూడ్స్‌ రైలు సేవలు నిలిచి పోయాయి. అక్టోబర్‌ చివరలో రెండు రోజులు మినహా ఒకటిన్నర నెలలుగా పంజాబ్‌లోకి గూడ్స్‌ రైళ్లు ప్రవేశించలేదు. దీంతో గోధుమ విత్తడానికి అవసరమైన ఎరువులు, థర్మల్‌ ప్లాంట్లకు బగ్గు సరఫరాతో సహా అవసరమైన నిత్యావసరాల కొరతకు దారితీసింది. క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు దర్శన్‌ పాల్‌, భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా అధ్యక్షులు బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ రైతుల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.


వ్యవసాయ సమస్యలపై కేంద్ర వైఖరికి ఏఐకెఎస్‌ ఖండన
పంజాబ్‌కు వెంటనే గూడ్స్‌ రైళ్ల సేవలు పునరుద్ధరించాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఎఐకెఎస్‌ డిమాండ్‌ చేసింది. నిజమైన పోరాటానికి నాయకత్వాన్ని అందిస్తున్న పంజాబ్‌ రైతు సంఘాలను ఏఐకెఎస్‌ అభినందించింది. దేశవ్యాప్తంగా కిసాన్‌ ఉద్యమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుంది. 26, 27 తేదీల్లో చలో ఢిల్లీ, 26 గ్రామీణ హర్తాళ్‌ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు విజయవంతం అవుతాయని, వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ బిల్లు రద్దు అయ్యే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపింది.