Dec 04,2021 03:03

వంటా వార్పు చేస్తున్న తాండవ సుగర్స్‌ రైతులు, కార్మికులు, సిఐటియు, రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
తాండవ, ఏటికొప్పాక సహకార చక్కెర ఫ్యాక్టరీలు తెరవాలని, బకాయిలు చెల్లించాలని ఈ నెల 23న జాతీయ రహదారి దిగ్బంధించాలని రైతులు, కార్మికులు నిర్ణయించారు. జాతీయ రహదారి దిగ్బంధనంతో ప్రారంభంకానున్న నిరసన ఫ్యాక్టరీలు తెరిచి, బకాయిలు చెల్లించేవరకు కొనసాగించాలని శుక్రవారం తాండవ ఫ్యాక్టరీ వద్ద జరిగిన వంటా వార్పు కార్యక్రమం సభలో మాట్లాడిన వక్తలు ఉద్ఘాటించారు. సిఐటియు, ఎపి రైతు సంఘం విశాఖ, తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ పరిశ్రమలు కాపాడుకుంటేనే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందన్నారు. చక్కెర ఫ్యాక్టరీలను దెబ్బతీయాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను పోరాటాలతో తిప్పికొట్టాలన్నారు. రైతు సంఘం నాయకులు కె.లోకనాథం మాట్లాడుతూ ఫ్యాక్టరీలను మూసివేసి కార్మికులు, రైతులను నట్టేటముంచడం దుర్మార్గమన్నారు. ఎపి చెరకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి అప్పారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక మూసివేయడం సరికాదన్నారు. చక్కెర ఫ్యాక్టరీల మూసివేయకుండా ఆధునికీకరణకు నిధులు విడుదల చేయడంతో పాటు క్రషింగ్‌ నిర్వహించి కార్మికులు, రైతుల బకాయిలు చెల్లించాలని కోరారు. చెరకు రైతు ఎన్‌.రమణ మాట్లాడుతూ ఐదెకరాల్లో చెరకు సాగుకు రూ.2 లక్షలు అప్పుజేశానని, తనకు బిల్లు చెల్లించకపోవడంతో కూలీలకు కూలి డబ్బులు చెల్లించలేకపోయానని పేర్కొన్నారు. చెరకు తోలి ఏడాదైనా బిల్లు ఇవ్వకపోవడంతో ఏడుస్తూ బతుకుతున్నామన్నారు. ఫ్యాక్టరీని నమ్ముకొని చెరకు సాగుచేస్తున్న తాము ఫ్యాక్టరీ ఒడిలోనే సచ్చిపోతాం తప్ప ఫ్యాక్టరీని వదులుకోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల రైతు సంఘం అధ్యక్షులు జి.నాయినిబాబు, టి.నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, డేవిడ్‌రాజు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌, సిఐటియు నాయకుడు ఎ.రాజు, పద్మజ తదితరులు పాల్గొన్నారు.