Sep 18,2021 22:35

మాట్లాడుతున్న ఆదినికల్సన్‌

ప్రజాశక్తి-గుంటూరు : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని, బోర్డులో పెండింగ్‌ క్లెయిమ్స్‌ వెంటనే విడుదల చేయాలని, కొత్త దరఖాస్తులకు కార్డులను వెంటనే ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈనెల 20న కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని గుంటూరు నగర భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) నగర ప్రధాన కార్యదర్శి ఆది నికల్సన్‌ కోరారు.శనివారం లాడ్జి సెంటర్‌ లోని కార్మిక అడ్డాలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ సమయంలో భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి సాయం చేయలేదని, రూ.10 వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్ని రకాల ప్రజలకు సంక్షేమ పథకాలందించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్మికులను మాత్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వ ఆఫీసులు, సచివాలయాలు నిర్మించే భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వానికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నిచారు. సంక్షేమ బోర్డు లో ఉన్న డబ్బులు ఇతర పథకాలకు తరలించడం సరి కాదన్నారు. వెంటనే సంక్షేమ బోర్డు లో వాడిన డబ్బులను బోర్డుకు జమచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట రూరల్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తున్నాయని సిఐటియు మండల కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని కళామందిర్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిర్మాణ కార్మికుల సమస్యలపై ఈ నెల 20న నరసరావుపేట సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాలో పాల్గొనాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ అధ్యక్షుడు సాతులూరి లూథర్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గణేష్‌ పాల్గొన్నారు.