Nov 25,2021 17:26

ప్రముఖ చైనా మొబైల్‌ తయారీ సంస్థ షియోమీ ఎలక్ట్రిక్‌ రంగంలోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. 2024లో తన మొదటి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని లాంచ్‌ చేయనున్నట్లు తాజాగా షియోమి సంస్థ ప్రకటించింది. ఎలక్ట్రికల్‌ వెహికల్‌ (ఈవీ) రంగంలోకి ఈఏడాది ప్రారంభంలోనే ప్రవేశించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఎలక్ట్రికల్‌ వాహనాల పరిశోధన అండ్‌ అభివృద్ధి కోసం.. మొత్తం 13,919 మంది సభ్యులు పనిచేస్తున్నారని పేర్కొంది. అయితే వీరిలో 500 మంది ఎలక్ట్రిక్‌ కారు ప్రాజెక్టులో పనిచేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆర్‌అండ్‌డి విభాగంలో దాదాపు 14 వేల మంది సభ్యులున్నారని.. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో వీరి శాతం 44 శాతం అని ఒక ఆర్థిక నివేదికలో పేర్కొంది.
షియోమీ ఈవీ రంగంలోకి ప్రవేశించడంపై ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ లీ జున్‌ మాట్లాడుతూ.. 2024లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ కార్లను షియోమీ ఉత్పత్తి చేస్తుంది. ఈ రంగంలో వచ్చే పదేళ్లలో సుమారు 10 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాం' అని తెలిపారు. షియోమీ తయారు చేసే ఎలక్ట్రిక్‌ కారుని 2023 మొదటి ఆరు నెలల్లో తయారు చేయడం ప్రారంభించి, 2024లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఇది ప్రస్తుత ప్రణాళిక మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. షియోమీ ఇప్పటికే తన ఈవీ కంపెనీ షియోమీ ఈవీని 10 బిలియన్‌ యువాన్ల(రూ.11,000 కోట్ల) మూలధనంతో ప్రారంభించింది. షియోమీ మొదటి ఈవీ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు ఇతర కంపెనీలైన యాపిల్‌, ఒప్పో, వివో, వన్‌ ప్లస్‌ ఎలక్ట్రిక్‌ కార్లతో పోటీ పడనుంది.