Jan 13,2022 18:21

ముంబై : దొంగలపాలైన సొత్తు దొరకడమంటే.. చాలా కష్టం. అది కూడా పోలీసుల చేతికంది.. లక్షల్లోపోయిన వారి సొమ్ము తిరిగి కోట్ల రూపాయల్లో దక్కిందంటే.. ఎంతో అదృష్టముండాలి కదూ..! ఇంతకీ ఈ లక్కీ పర్సన్‌ ఎవరు? ఎన్నేళ్ల క్రితం సొమ్ము పోయింది? మళ్లీ ఎప్పుడు తిరిగొచ్చింది? అని తెలుసుకోవాలని ఉందా? వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ప్రముఖ చరగ్‌ దిన్‌ వ్యవస్థాపకుడు అర్జున్‌ దాస్వానీ కుటుంబంపై ఒక ముఠా కత్తులతో దాడి చేసి.. సుమారు రూ. 13 లక్షల విలువైన ఆస్తిని దొంగిలించింది. ఈ కేసులో 1999లో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి.. ఆ తర్వాత వారు నిర్దోషులని విడుదల చేశారు. అలాగే ఈ కేసుకి సంబంధించిన మరో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే 19 ఏళ్లుగా పోలీసుల ఆధీనంలో ఉన్న ఆ ఆస్తి ఫిర్యాదుదారునికి అందకపోవడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని, సొత్తును షరతులతో కూడిన నిబంధనలకు లోబడి.. తక్షణమే ఆ కుటుంబ సభ్యులకు అందజేయాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఫిర్యాదుదారుడైన అర్జున్‌ దాస్వానీ 2007లోనే మరణించడంతో అతని కుమారుడైన రాజు దాస్వాకి పోలీసులు ఈ సొత్తును అందజేయడం జరిగింది. అయితే ఆ ఆస్తి విలువ ఇప్పుడు రూ. 8 కోట్లు కావడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.