Apr 14,2021 21:35

అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 18 శాతం పెరిగిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ అన్నారు. 2019 ఏప్రిల్‌ తొలి రోజుల్లో సగటు వినియోగం 189 మిలియన్‌ యూనిట్లు (ఎంయు) ఉందని, ప్రస్తుతం 224 ఎంయుకు చేరిందని తెలిపారు. 2019తో పోలిస్తే 18 శాతానికి పెరిగిందని చెప్పారు. విద్యుత్‌ సౌదలో అంబేద్కర్‌ జయంతి బుధవారం జరిగింది. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి శ్రీకాంత్‌ పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఈ ఏడాది విద్యుత్‌ డిమాండ్‌ 64 వేల ఎంయుకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎంతటి డిమాండునైనా తట్టుకుని నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు విద్యుత్‌ సంస్థలు సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో జెఎమ్‌డిలు కె.శ్రీధర్‌ రెడ్డి, కె.వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు ప్రవీణ్‌ కుమార్‌, ముత్తుపాండ్యన్‌, సిఇలు సూర్యచందం, ఎకెవి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.