Apr 13,2021 16:47

లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన, వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న రాయిటర్స్‌ వార్తా సంస్థ కొత్త అధ్యాయానికి తెరలేపింది. చీఫ్‌ ఎడిటర్‌ బాధ్యతల్ని ఓ మహిళకు అప్పగించారు. ఇప్పటివరకు ఆ సంస్థ చీఫ్‌ ఎడిటర్‌ బాధ్యతలను పురుషులు మాత్రమే నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఆ బాధ్యతను ఎడిటర్‌గా చేస్తున్న అలెగ్జాండ్రా గల్లొనిని చీఫ్‌ ఎడిటర్‌గా ఎంపిక చేశారు. దాదాపు 170 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వార్తాసంస్థలో మహిళా జర్నలిస్టు చీఫ్‌ ఎడిటర్‌ కావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్టీఫెన్‌ ఈ నెల చివర్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయన సారథ్యంలో రాయిటర్స్‌ వార్తాసంస్థ అనేక జర్నలిజం అవార్డులతోపాటు, ఏడు పులిట్జర్‌ అవార్డులను గెలుచుకోవడం విశేషం. రాయిటర్స్‌ న్యూస్‌ ఏజెన్సీకి ప్రపంచవ్యాప్తంగా 2,450 మంది జర్నలిస్టులు, 600 మంది ఫొటో జర్నలిస్టులు ఉన్నారు. 1851లో పాల్‌ రాయిటర్స్‌ అనే వ్యక్తి లండన్‌లో ఈ సంస్థను స్థాపించాడు.
చీఫ్‌ ఎడిటర్‌ బాధ్యతలు నిర్వహించనున్న అలెగ్జాండ్రా గల్లొని నాలుగు భాషలు మాట్లాడగలరు. అలాగే తనకు వ్యాపార, రాజకీయ వార్తాలను కవర్‌ చేసిన అనుభవం ఉన్నది. గతంలో ఆమె వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో పనిచేశారు.