
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వెలగపూడిలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఆదివారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నలుగురు ఎఎస్పిలు 20 మంది డీఎస్పీలు, 58 మంది సీఐలు, తొమ్మిదిమంది ఆర్ఐలు, 88 మంది ఎస్సైలు, 7 ఆర్ఎస్సైలు, 8 మంది విమెన్ ఎస్సైలు, 232 మంది ఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు, 300 మంది కానిస్టేబుళ్లు, 108 మంది మహిళా కానిస్టేబుళ్లు, 424 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 168 మంది ఎఆర్ సిబ్బంది, 211 హోం గార్డులు, 2 ప్లటూన్ల ఎపిఎస్పి పోలిసులతో కలిపి మొత్తం 1637 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. పై స్థాయి అధికారి నుండి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ విధుల్లో సున్నితంగా వ్యవహరించాలని చెప్పారు. అసెంబ్లీ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. గరుడా కంట్రోల్ కేంద్రం నుండి పర్యవేక్షిస్తామని, డీఎస్పీ ఆద్వర్యంలో ఒక సీఐ, ఒక ఎస్సై, 10 మంది సిబ్బంది కలిగిన కమ్యూనికేషన్ టీం, ఒక ఎస్సై, 5 సిబ్బంది కలిగిన ఐటి కోర్ టీంలు ఆధ్వర్యంలో సీసి కెమెరాలు, డ్రోన్ ఆపరేటింగ్ లైవ్ స్ట్రీమింగ్, బాడీ వోర్న్ కెమెరాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో నిత్యం నిఘా ఉంచుతారని పేర్కొన్నారు. భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా యాంటీ సబ్టేజ్ చెక్, బ్యాగేజ్ స్కానర్స్, వెహికల్ ఇన్స్పెక్షన్ మిర్రర్ వంటి పరికరాలతో చెక్ చేస్తామన్నారు. సిబ్బందికి మాస్కులు, సానిటైజర్లు వాడటం, భౌతిక దూరం తప్పనిసరన్నారు.