Apr 14,2021 20:36

న్యూఢిల్లీ : తమ ఉద్యోగులు, అసోసియేట్లు, విక్రేతలతో పాటుగా ఇతర భాగస్వాములకు సంబంధించి 10 లక్షల వ్యాక్సిన్‌ ఖర్చులను భరిస్తామని అమెజాన్‌ ఇండియా తెలిపింది. వ్యాక్సినేషన్‌ ఖర్చును కేవలం తమ ఉద్యోగులు, అసొసియేట్లకు మాత్రమే కాకుండా అమెజాన్‌ ఫ్లెక్స్‌ డ్రైవర్లు, ఐ హ్యావ్‌ స్పేస్‌ (ఐహెచ్‌ఎస్‌) స్టోర్‌ భాగస్వాములు, ట్రకింగ్‌ భాగస్వాములు, వారి అర్హత కలిగిన డిపెండండ్లు సహా డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ అసోసియేట్స్‌ నెట్‌వర్క్‌ భాగస్వాములకు చెల్లిస్తామని పేర్కొంది. అదే విధంగా చురుగ్గా అమెజాన్‌ డాట్‌ ఇన్‌పై లిస్టింగ్‌ చేయబడ్డ విక్రేతలకు సైతం ఈ ప్రయోజాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. వీలైనంత త్వరగా తగిన సమయంలో వ్యాక్సిన్‌లు వేయించుకుని తమ సిబ్బంది, భాగస్వాములు వారి కమ్యూనిటీలను కాపాడుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నామని అమెజాన్‌ ఇండియా తెలిపింది.