శుక్రవారం జరగనున్న హ్యూగో ఛావెజ్ అంత్యక్రియలకు లాటిన్ అమెరికా దేశాధినేతలు పలువురు హాజరుకానున్నారు. ప్రాంతీయ సమగ్రత, స్వేచ్ఛకు యావజ్జీవితాన్ని ధారవోసిన ఛావెజ్‌కు బ్రెజిల్, హైతీ, చిలీ, అర్జెంటీనా, బొలీవియా, డొమినికన్ రిపబ్లిక్, ఉరుగ్వే, క్యూబా, ఈక్వెడార్ వంటి దేశాలు మూడు రోజులు సంతాపదినాలు ప్రకటించగా, నికరాగువా ప్రభుత్వం వారం రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. అర్జెంటీనా అధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్, బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్, ఉరుగ్వే అధ్యక్షుడు జోస్ ముజికా, మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో, కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ శాంటోస్, నికరాగువా అధ్యక్షుడు డేనియల్ ఆర్టెగా చావెజ్ అంత్యక్రియలకు హాజరవుతున్నట్లు గురువారం తెలియజేశారు. వీరితో పాటు ఈక్వెడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరియా, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, పెరూ అధ్యక్షుడు ఒల్లాంటా హుమాలా, హైతీ అధ్యక్షుడు మైకేల్ మార్టెల్లీ, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా, డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు డేనిలో మదీనా తదితరులు కూడా ఛావెజ్ అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. చావెజ్ మరణానికి ముందు రెండునెలల పాటు ఆయనకు వైద్యచికిత్సను అందించి, ఆతిథ్యం ఇచ్చిన సన్నిహిత మిత్ర దేశం క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, ఉరుగ్వే తదితర దేశాలు తమ జాతీయ పతాకాలను అవనతం చేసి అధికారిక లాంఛనాలతో నివాళు లర్పించాయి. ఛావెజ్ మృతికి మూడు రోజులు సంతాపదినాలు ప్రకటించిన హైతీ అధ్యక్షుడు మార్టెల్లీ తమ దేశం పట్ల ఛావెజ్ చూపిన ప్రేమానురాగాలకు చిహ్నంగా ఆయన స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఛావెజ్ మరణవార్త తెలిసిన వెంటనే నికరాగువా అధికార పక్షం శాండినిస్టా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ మంగళవారం రాత్రి అధికారికంగా సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఛావెజ్ మృతితో తాము 'ఆప్త మిత్రుడ్ని' కోల్పోయామంటూ ఈ ప్రాంత దేశాధినేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాలతో కూడిన బొలివేరియన్ అలయెన్స్ ఫర్ ది అమెరికాస్ (అల్బా), సౌత్ అమెరికన్ మార్కెట్ (మెర్కోసుర్) కూటములు ఛావెజ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. క్యూబా అధినేత ఫైడెల్ కాస్ట్రోతో కలిసి 2004లో ఛావెజ్ అల్బా కూటమిని స్థాపించిన విషయం తెలిసిందే.
నైజీరియా నివాళి
మంగళవారం తుది శ్వాస విడిచిన వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ స్మృతికి నైజీరియా ప్రభుత్వం ఘన నివాళు లర్పించింది. ఈ విషాద సమయంలో వెనిజులా ప్రజలకు తమ దేశ ప్రజల తరపున పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు జోనాధన్ ఒక ప్రకటనలో తెలిపారు.
తుది సారి సందర్శనకు బారులుతీరిన ప్రజలు
ఇదిలా ఉండగా తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు వేలాది మంది వెనిజులా ప్రజలు రాజధాని కారకాస్ నగరానికి చేరుకుంటున్నారు. ఛావెజ్ భౌతిక దేహాన్ని సైనిక లాంఛనాలతో ఊరేగించి ప్రజల సందర్శనార్ధం మిలటరీ అకాడమీలో వుంచారు. ఈ అకాడమీ ఆస్పత్రిలోనే ఆయన మంగళవారం సాయంత్రం కన్ను మూసిన విషయం తెలిసిందే. శు క్రవారం అంత్యక్రియలు జరిగే వరకూ ఛావెజ్ భౌతిక కాయాన్ని అక్కడే వుంచుతారు. ఛావెజ్ భౌతిక దేహాన్ని ఊరేగించిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నికొలస్ మదురో, ఛావెజ్ తదితర నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన భౌతిక దేహం వుంచిన శవపేటికకు మతపెద్ద దైవాశీస్సులను అందచేశారు.