లాటిన్‌ అమెరికా రూపురేఖల్నే మార్చేసిన ధీరుడు

  • చావెజ్‌కు ఎకలాక్‌ ఘన నివాళి

దాదాపు దశాబ్దన్నర కాలం వెనిజులా అధ్యక్షుడిగా సేవలందించిన హ్యూగో ఛావెజ్‌ తన విప్లవాత్మక విధానాలతో లాటిన్‌ అమెరికా దేశాల ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేశారని ఐరాస లాటిన్‌ అమెరికా ప్రాంతీయ ఆర్థిక విభాగం (ఎకలాక్‌్‌) ఘనంగా నివాళు లర్పించింది. లాటిన్‌ అమెరికా ప్రాంత చరిత్రను పునర్లిఖించిన మహనీయులతో సమంగా ఛావెజ్‌ తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎకలాక్‌ ప్రధాన కార్యదర్శి అలీషియా బార్సెనా వెనిజులా ఉపాధ్యక్షుడు నికొలస్‌ మదురోకు పంపిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. లాటిన్‌ అమెరికా దేశాల ఆర్థిక ముఖచిత్రాన్ని ఛావెజ్‌ సమూలంగా మార్చివేశారని, వ్యక్తిగత ప్రతిష్ట కంటె మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక మార్పులు చేపట్టినవారెవరైనా ఎదురులేని శక్తిగా నిలుస్తారని ఛావెజ్‌ తన చేతల ద్వారా నిరూపించారని ఆమె పేర్కొన్నారు. నిరుపేదల కోసం అకుంఠిత దీక్షతో కృషి చేసిన ఛావెజ్‌తో ప్రత్యక్షంగా కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

లాటిన్‌ అమెరికా దేశాల నివాళి

ఎక్లాక్‌తో పాటు లాటిన్‌ అమెరికా దేశాల కూటమి సెలాక్‌, లాటిన్‌ అమెరికా దేశాల సంఘం (యునాసుర్‌) తదితర కూటములు కూడా ఛావెజ్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మృతికి ఘనంగా నివాళు లర్పించాయి. లాటిన్‌ అమెరికాను మరింత స్వేచ్ఛాయుత ప్రాంతంగానూ, ఐక్యంగానూ ఉంచేందుకు తామంతా పునరంకితం అవుతామని ఆయా కూటముల అధినేతలు ఈ సందర్భంగా ప్రతిన పూనారు. లాటిన్‌ అమెరికా ఐక్యతకు యావజ్జీవితాన్ని ధారవోసిన ఛావెజ్‌ మృతి ఈ ప్రాంత దేశాలకే కాక ప్రపంచ దేశాలకు కూడా తీరని లోటని వారు విచారం వ్యక్తం చేశారు.

Publiture