వెనిజులాకు దాదాపు దశాబ్దన్నర కాలం పాటు స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందించి ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ (58) మంగళవారం (స్థానిక కాలమాపనం ప్రకారం సాయం.4.25 గంటలకు) రాత్రి 11.25 గంటలకు కన్ను మూశారు. రెండేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి బారిన పడిన ఛావెజ్‌కు నాలుగు సార్లు శస్త్ర చికిత్స జరిగినా వైద్య నిపుణులు ఆయన్ను కాపాడుకోలేకపోయారు. తాత్కాలిక అధ్యక్షుడు నికొలస్ మదురో మంగళ వారం రాత్రి ప్రభుత్వ టెలివిజన్‌లో చేసిన అధికారిక ప్రకటనలో ఛావెజ్ మరణాన్ని ధృవీకరించారు. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో నాల్గోసారి వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికైన ఛావెజ్ ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆకస్మికంగా కన్నుమూయటంతో ఆ దేశంలో మరోసారి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. జీవితాంతం సామ్రాజ్యవాద అమెరికాకు వ్యతిరేకంగా నిలిచి ఆ దేశాన్ని తమవైపు కన్నెత్తి చూడని విధంగా కట్టడి చేసిన ఛావెజ్ తనపై దాడి చేసిన క్యాన్సర్ మహమ్మారిని మాత్రం కట్టడి చేయలేకపోవటం విశేషం. వెనిజులాను సోషలిస్టు సమాజానికి నమూనాగా తీర్చిదిద్దిన ఛావెజ్ మరణంపై ఆయనతో మమేకం అయిన వెనిజులా ప్రజలు కన్నీరు మున్నీరవుతుండగా ప్రపంచ దేశాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచ నలు మూలల నుండి ఛావెజ్ మృతికి సంతాప సందే శాలు వెల్లువెత్తుతున్నాయి. ఛావెజ్ మృతి నేపథ్యంలో ప్రస్తుత ఉపాధ్యక్షుడు నికొలస్ మదురో వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. సామ్రాజ్యవాదం క్రమంగా ఆఫ్రికా, ఆసియా దేశాలను కబళించేందుకు అర్రులు చాస్తున్న ఈ తరుణంలో ఛావెజ్ నిష్క్రమించడం ప్రపంచ వ్యాపితంగా ఉన్న సామ్రాజ్యవాద, ప్రజాతంత్రవ్యతిరేక శక్తులను కుంగదీసింది. ఛావెజ్ లేని లోటును వెనిజులా పూడ్చుకోవడం కష్టమే అయినా ఆయన రగిలించిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని, వెనిజులా ఉపాధ్యక్షుడు మదురో ప్రకటించారు.